చిన్నారులు చిత్రాల్లో నటించాలంటే కచ్చితంగా కలెక్టర్ అనుమతి..

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేంద్రం తెచ్చిన నూతన చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలకార్మిక చట్టంలో పలు సవరణలు చేసింది. ఇప్పటి వరకు బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపైనే చట్టప్రకారం చర్యలు తీసుకునేవారు. కానీ చట్ట సవరణతో ఇకపై పిల్లల్ని పనికి పంచించే తల్లిదండ్రులు, సంరక్షులపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు బాలకార్మిక చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చిన్నారులను పనిలో పెట్టుకుంటే ఏడాది వరకు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తారు.
పిల్లలు బడి మానేస్తే ప్రధానోపాధ్యాయులు ఈ విషయమై తక్షణమే స్థానిక నోడల్ అధికారికి సమాచారం అందిస్తారు. దీంతో పిల్లలు ఎందుకు పాఠశాలకు రావట్లేదో టాస్క్ ఫోర్స్ విచారరణలో తేలిపోతుంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా సినిమాలు, టీవీ షోలు, ఇతర స్టేజి షోల్లో చిన్నారులు నటించాలంటే నిర్మాత, నిర్వాహకులు కలెక్టర్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. తెలంగాణ బాల కార్మిక చట్టం ప్రకారం అండర్ టేకింగ్ రూల్ 2 సీ (10బీ) ప్రకారం ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్‌లో వివరాలు నమోదు చేసి బాల నటులతో చిత్రీకరణకు కలెక్టర్ నుంచి నిర్మాత అనుమతి పొందాల్సి ఉంటుంది. చిన్నారులకు అందించే పారితోషికం విషయంలోనూ బాల కార్మిక చట్టంలో పలు అంశాలను సవరించారు. ఈ మేరకు ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కౌముదిని ఉత్తర్వులు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com