TS: ఖమ్మం లోక్‌సభ బరిలో ఎవరు?

తెలంగాణలో (Telangana) అత్యధిక లోక్‌సభ (Lok sabha) స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న అధికార కాంగ్రెస్... ఆ దిశగా కసరత్తు మరింత ముమ్మరం చేస్తోంది. పార్లమెంట్ బరిలో నిలిచే ఆశావహ అభ్యర్థుల వివరాలను ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలించింది. ఖమ్మం లోక్ సభ స్థానం (Khammam Lok Sabha Position) నుంచి పోటీకి 12 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా..వీరిలో సరైన అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు సాగిస్తోంది. ఖమ్మం బరిలో పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని (Sonia gandhi) రంగంలోకి దిగాలంటూ డిమాండ్లు వినిపిస్తుండగా ఒకవేళ పార్టీ అధినేత్రి పోటీలో లేని పక్షంలో సీటు తమదంటే తమదంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. గాంధీ భవన్ వేదికగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆశావహుల వివరాలు పరిశీలించింది. 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఇప్పటికే జిల్లా పార్టీ తీర్మానించి రాష్ట్ర పార్టీకి ప్రతిపాదనలు పంపింది. ఖమ్మం బరిలో ఎవరు నిలుస్తారు, అధిష్టానం ఎవరి అభ్యర్థిత్వం ఖరారు చేస్తుందన్నది ఇపుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. టికెట్ ఆశిస్తున్న వారిలో ముగ్గురి పేర్లతో పీఈసీ త్వరలోనే అధిష్ఠానానికి ప్రతిపాదించనుంది. పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, వి.హనుమంతరావు సీటు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు సైతం టికెట్ రేసులో ప్రధానంగా ఉన్నారు. ఏళ్లుగా పార్టీకి విధేయులుగా ఉన్న తమకు అవకాశం కల్పించాలంటూ రాయల నాగేశ్వరరావు, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మద్ది శ్రీనివాస్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి వారే టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. టికెట్ దక్కించుకుంటే చాలు సగం విజయం సాధించినట్టేనని నేతలు భావిస్తున్నారు.
పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఖమ్మం బరిలో నిలిస్తే ఆమె ఘనవిజయం సాధించేలా పనిచేస్తామని ఆశావహులంతా ప్రకటించారు. ఒకవేళ ఆమె పోటీలో లేని పక్షంలో తమకంటే తమకు సీటు కేటాయించాలని పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ ఆశిస్తూ డజను మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఐదుగురు నేతల మధ్యే ఉన్నట్లు కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా టికెట్ రేసులో మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగంధర్, మల్లు నందిని, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పోటీపడుతున్నారు. ముగ్గురు మంత్రుల కుటుంబీకులు అభ్యర్థిత్వం ఆశించడం వల్ల ఎంపికలో పీఠముడి తప్పేలా లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com