Congress: నాయకత్వ లేమితో సతమతం... దిక్కులు చూస్తున్న హస్తం పార్టీ

Congress: నాయకత్వ లేమితో సతమతం... దిక్కులు చూస్తున్న హస్తం పార్టీ
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు; నాయకత్వ లేమి... తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి...



ఎన్నికలెప్పుడు వచ్చినా సిద్దమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సై అంటోంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంపాలైంది. రెండు టర్మ్ లలో 17మంది కాంగ్రెస్ లో గెలిచి అధికారపార్టీలో చేరారు. గత ఏనిమిదేళ్లుగా ఎన్నిక అది ఉపఎన్నిక అయినా.. మున్సిపల్ పంచాయితీ కార్పోరేషన్ ఏవైనా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపిందిలేదు. పొన్నాల లక్ష్మయ్య, ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ ఛీఫ్ లుగా పనిచేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పీసీసీ ఛీఫ్ గా ఉన్నారు. రేవంత్ పీసీసీ అయ్యాక కాంగ్రేస్ లో జోష్ వచ్చిందన్న ప్రచారం ఎలా ఉన్నా.. ఎన్నికల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హుజూరాబాద్ లో డిపాజిట్ కోల్పోయింది. నాగార్జున సాగర్ లో రెండోస్తానం , మునుగోడులో మూడోస్థానంతో సరిపెట్టుకొంది. అటు సీనియర్ వర్సెస్ వలస నేతలంటూ కాంగ్రెస్ లో రేవంత్ టార్గెట్ గా రాజకీయం నడుస్తోంది. ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ పరిస్ధితి ఏంటి .. 119 నియోజకవర్గాల్లో పార్టీకి ఇంచార్జ్ లు ఉన్నారా.. దాదాపు 45 నుంచి 50 నియోజకవర్గాల్లో నడిపించేనాయకుడులేక చతికిలపడిపోయింది.



ఉత్తర తెలంగాణ లో ఆదిలాబాద్ , కరీంనగర్ ,వరంగల్ , నిజామాబాద్ ,ఖమ్మం జిల్లాలో 55 నియోజకవర్గాలున్నాయి..ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించిన పార్టీ దాదాపు అధికారంలోకివస్తోందనడం లో సందేహం లేదు. గత 2014 2018 ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ఖమ్మం మినహా మిగితా నాలుగు జిల్లాలో హవా కొనసాగించింది.. కాంగ్రెస్ పరిస్ధితి ఈ ఐధు జిల్లాల్లో చాలదయనీయంగా ఉంది.. జిల్లాల పునర్ విభజన జరగకముందు బలమైన న్యాయకత్వంలా కనిపించిన కాంగ్రెస్ పార్టీ.. పునర్విభజన తరువాత లీడర్లు సైతం చెట్టుకొక్కరు పుట్టకొక్కరులా చెల్లా చెదురుఅయ్యారు..ఫలితంగా అన్ని జిల్లాల్లో న్యాయకత్వం బలహీనపడింది.


ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే .. పది నియోజవర్గాలున్నాయి. 2014 లో ముదోల్ నుంచి గెలిచిన ఒకే ఒక్కడు గడ్డం విఠల్ రెడ్డి తర్వాత టీఆర్ఎస్ లోచేరి..2018లో టీఆర్ఎస్ అభ్యర్దిగా పోటి చేసి గెలిచాడు.. ఒక రకంగా గెలిచిన ఒక్క సీటును కాపాడుకోలేకపోయింది కాంగ్రెస్ ..ఇక 2018లో ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు గెలిచాడు. ఆయన సైతం టీఆర్ఎస్ లో చేరడంతో ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రాతినిద్యం కోల్పోయింది.. నియోజకవర్గాలవారిగా పరిశీలిస్తే ప్రసుతం నిర్మల్ ,మంచిర్యాల నియోజకవర్గాల్లో మాత్రమే కాస్త పేరున్న లీడర్లు కనపడుతున్నారు. నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఒక్కసారి పీఆర్పీనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆతర్వాత రెండు సార్లు ఓటమి చెందారు.ఇప్పుడు పీసీసీ ఛీఫ్ తో పొసగడంలేదు. పార్టీలో ఉంటారా.. బీజేపీవైపు వెళతారా అన్నది ఇంకా సస్పెన్స్ గా నే ఉంది.


మంచిర్యాల లో సైతం ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఉన్నారు. బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు ప్రభావం ఉంటుంది..ఈయనసైతం పీసీసీ ఛీఫ్ రేవంత్ తో సఖ్యతతో లేరు. మంచిర్యాల నుంచిపోటికి సిద్దం గాఉన్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ మూడోస్థానంలో ఉందనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. ఒకసారి భార్గవ్ దేశ్ పాండే.. 2018లో సుజాత పోటి చేశారు. 2004లో సి రామచంద్రారెడ్డి చివరిసారి గెలుపొందారు.. 2009 నుంచి వరుసగా జోగు రామన్న గెలుపొందుతూ వస్తున్నారు.. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా సాజిద్ ఖాన్ , సుజాత ఈసారి ఇద్దరు పోటిపడుతున్నారు.. పార్టీ పరిస్దితి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.. ఇక ఎస్టీ నియోజకవర్గాలైన బోధ్ ఆసిఫాబాద్ ఖానాపూర్ లో సైతం పార్టీ క్యాడర్ ఉన్నప్పటికి లీడర్ లేక సతమతమవుతోంది.



బోద్ లో అనిల్ జాదవ్ టీఆర్ఎస్ లో చేరడంతో ..గజేందర్ ,నరేష్ జాదవ్ ప్రస్తుతం పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడ ఇటివలే కాంగ్రెస్ లోచేరిన సర్పంచ్ సరస్వతి టికెట్ రేసులో ఉన్నారు, ఖానాపూర్ లో 89 లో చివరిసారిగా కొట్నాక్ భీంరావు గెలుపొందారు.. 94 నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. ముదోల్ లో 2014 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన విఠల్ రెడ్డి టీఆర్ఎస్ లోచేరడంతో అక్కడ కాంగ్రెస్ వీక్ అయింది. రామారావు పటేల్ బీజేపీలో చేరడంతో న్యాయకత్వసమస్యతో కొట్టుమిట్టాడుతోంది. సిర్పూర్ లో పాల్వాయి హరీష్ బలమైన నేత బీజేపీలో చేరడంతో ఇక్కడ సైతం బలహీనపడింది. రావిశ్రీనివాస్ గత ఎన్నికల్లో బీఎస్పీనుంచిపోటిచేశారు..ఈసారి కాంగ్రెస్ నుంచి పోటిచేసేందుకు రెడి అవుతున్నారు..



చెన్నూరు లో గత రెండు సార్లు టీఆర్ఎస్ గెలిచింది. నూకాల రమేష్ సంజీవరావు దుర్గం భాస్కర్ లు నియోజకవర్గంలో తిరుగుతు ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు నూకాల రమేష్ కు మద్దతు తెలుపుతున్నట్టు అంటున్నారు. ఇక బెల్లంపల్లి నంచి సీనియర్ నేత గడ్డం వినోద్ , గత ఎన్నికల్లో పోటి చేసిఓడిన శంకర్ లు రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో వినోద్ బీఎస్పీనుంచి పోటి చేశారు తర్వాత కాంగ్రెస్ లో చేరారు. గత రెండు సార్లు ఒక్కోసీటు గెలిచినా.. నిలబెట్టుకోలేకపోయినా కాంగ్రెస్ ఈసారి అధికారపార్టీ ఎమ్మెల్యేల పై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాల్సిందే తప్పా సొంతగా గెలిచే పరిస్తితిలేదు.అటు ఉత్తర తెలంగాణలో చాపకింద నీరులా బీజేపీ పాగవేస్తోంది. ఆదిలాబాద్ ,నిజామాబాద్ కరీంనగర్ ఎంపీ సీట్లను కైవసం చేసుకొని ..ఈసారి ఎమ్మెల్యే సీట్ల పై గురిపెట్టింది..



ఉమ్మడి వరంగల్ జిల్లా లో పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 2014లో డోర్నకల్ ఒక్కసీటు గెలిచింది. నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్ దొంతి మాదవరెడ్డి గెలుపొందాడు. రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరి 2018 లో ఆపార్టీనుంచి గెలుపొందారు. ఇక్కడ పార్టీ బలంగా ఉన్నా.. రాంచంద్రానాయక్ , నెహ్రూనాయక్ ఇద్దరి మద్య వర్గపోరు నడుస్తోంది.ఇది పార్టీకి మైనస్ గా మారనుంది. ఇక మహాబూబ్ బాద్ లో సీనియర్ నేతలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు.మాజీ కేంద్రమంత్రి బల్ రాం నాయక్ ఉన్నప్పటికి పార్టీ బలహీనపడింది. పాలకుర్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటిచేసిన జంగారాఘవరెడ్డి ఈసారి హన్మకొండ జనగాం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొద్దొ గొప్పో ఓటుబ్యాంక్ ఉన్న..లీడర్ లేక చతికిలపడిపోతోంది. నర్సంపేట లో 2014 లో దొంతి మాదవరెడ్డి ఇండిపెండేంట్ కాంగ్రెస్ రెబల్ గా పోటి చేసి గెలిపోందారు. బలమైన క్యాడర్ ఉంది. నర్సంపేట పరవాలేదని చెప్పవచ్చు. వర్దన్నపేట లో కాంగ్రెస్ పార్టీ కి లీడర్ కరువయ్యారు. 2009 లో గెలిచిన శ్రీదర్ బీజేపీలో చేరడంతో నాయకుడు లేని పార్టీ అయింది. గత రెండు దఫాలుగా టీఆర్ఎస్ దే హవా. ములుగు లో సీతక్క ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. సీతక్క కు తిరుగులేదని చెప్పవచ్చు. భూపాలపల్లి లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు..ఇండిపెండేంట్ గా పోటి చేసిన గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ బలంగా ఉందని చెప్పవచ్చు. పరకాల నియోజకవర్గంలో బలమైన క్యాడర్ అంతా బీఆర్ఎస్ లోచేరింది, కొండాసురేఖ ఫ్యామిలి ముద్ర ఉన్నప్పటికి వరంగల్ తూర్పు నుంచి కొండాసురేఖ పోటికి సిద్దమవుతోంది. ఇక్కడ కూతరు ను బరిలో నిలపాలని చూస్తున్నారు.. రెండు టికెట్లు ఇస్తారా లేదన్నదానిపై కాంగ్రెస్ పార్టీ భవితవ్యం మూడు నియోజకవర్గాల పై ఆదారపడి ఉంది. భూపాలపల్లి, పరకాలు, వరంగల్ తూర్పులో కొండా ఫ్యామిలి క్యాడర్ ఉంటుంది.. వరంగల్ వెస్టులో నాయిని రాజేందర్ రెడ్డి, జంగారాఘవరెడ్డి, వేంనరేందర్ రెడ్డి ముగ్గురు మద్య ఆదిపత్యపోరు నడుస్తోంది. ఇక్కడ బీజేపీ సైతం ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆపార్టీలో చేరడంతో త్రిముఖపోరు తప్పదనిపోస్తోంది., ఎవరికి టికెట్ వచ్చినా..కలిసిపనిచేస్తే తప్పా.. పార్టీ గెలిచే పరిస్తితిలేదు.. ఇక స్టేషన్ ఘణపూర్ నుంచి రాజయ్య టీఆర్ఎస్ లో చేరిన తర్వాత అక్కడ కాంగ్రెస్ కు న్యాయకత్వలేమి ఏర్పడింది. గత ఎన్నికల్లో ఇందిరా పోటి చేసింది..ప్రస్తుతం లీడర్ లేని పరిస్ధితి . జనగామ లో పొన్నాల లక్ష్మయ్య , కొమ్మూరి ప్రతాపరెడ్డి , జంగా రాఘవరెడ్డి లమద్య త్రిముఖపోరు నడుస్తోంది. రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉన్నా.. క్యాష్ చేసుకోనే స్ధితిలో కాంగ్రెస్ పార్టీ లేదనే చెప్పవచ్చు.. ఈ జిల్లాల్లో సైతం బీజేపీ మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడింది.. మేలుకోకపోతే ఈసారి కాంగ్రెస్ కు పరాభవం తప్పదు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరిదయనీయంగా తయారైంది.. జగిత్యాల మంధని తప్పా ఎక్కడ బలమైన న్యాయకత్వం లేదు. జిల్లాల విభజన తర్వాత శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ ముగ్గురు మూడు జిల్లాలకు పరిమితమయ్యారు.. ఉమ్మడి జిల్లా న్యాయకత్వం వీక్ అయిపోవడంతో ..కాంగ్రెస్ పరిస్దితి అద్వాన్నంగా మారింది. కరీంనగర్ నుంచి పొన్నం ప్రబాకర్ ఎమ్మెల్యేగా పోటిచేసి ఓడిపోయారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ చివరిసారికరీంనగర్ ఎమ్మెల్యేగా పోటిచేసి ఓడినా.. ఎంపి గా పోటి చేసి గెలవడంతో ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బలపడేందుకు దోహడపడింది.. కాంగ్రెస్ క్రమక్రంగా మరుగునపడుతోంది.. మానకొండూరులో కవ్వంపల్లి , చొప్పదండి లో మేడిపల్లి సత్యం, హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి, ధర్మపురిలో లక్ష్్ణ్, కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు, వేములవాడలో ఆదిశ్రీనివాస్ , సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి , రామగుండంలో మక్కాన్ సింగ్ ఠాకూర్ , పెద్దపల్లి విజయరమణారావు లాంటి బలమైన నేతలున్నారు.. అయితే క్యాడర్ లో కాన్పిడెన్స్ నింపడంలో విపలమవుతున్నారు.. మరో పక్క బీజేపీ దూసుకపోతుంది.. హుజూరాబాద్ లో మాత్రం లీడర్ లేని పార్టీగా మారింది.



ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదినియోజకవర్గాల్లో 2014 లో కాంగ్రెస్ ఒక్క స్థానం గెలువలేకపోయింది..2018 లో ఎల్లారెడ్డి నుంచి గెలిచిన జాజుల సురేందర్ రెడ్డి బీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు..ఇక్కడ ప్రాతినిద్యంలేని జిల్లాగా మారింది.. నిజామాబాద్ ఎంపీ సీటు బీజేపీ గెలపడం కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడంతో ఉనికే ప్రశ్నార్దకంగా మారింది.. మధుయాష్కి రెండుసార్లు ఎంపీగా గెలిచిన నిజామాబాద్ లో ఇప్పుడా పార్టీ స్ధితి దయనీయమనే చెప్పుకోవాలి.. షబ్బీర్ అలీ సుదర్మన్ రెడ్డి లాంటి సీనియర్లు ఇద్దరు ఉన్నా.. వారు తమ నియోజకవర్గంలో గెలవలేని స్దితి..ఇక జిల్లాలో పరిస్దితి చెప్పనక్కర్లేదు.. ఆర్మూర్ లో లీడర్ లేడు. బాన్సువాడలో మూడుసార్లు పోటిచేసిన బాలరాజు ఓడిన పరిస్ధితి. నిజామాబాద్ అర్బన్ లో డి శ్రీనివాస్ నిష్క్రమణ తర్వాత 2009 నుంచి గెలిచిన దాఖాలాలులేవు, డిఎస్ కొడుకు సంజీవ్ ,తహార్ బిన్ ఆహ్మద్, వేణు ముగ్గురు పోటి పడుతున్నారు. నిజామాబాద్ రూరల్ భూపతిరెడ్డి ప్రస్తుతం యాక్టివ్ గాలేరు.బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. బోదన్ ,జక్కల్ లో సుదర్మన్ రెడ్డి,గంగరాం లే పోటికి సిద్దమవుతున్నారు. బాల్కొండలో ఎర్రావతి అనిల్ ఇంచార్జీగా ఉన్నారు..పీఆర్పీనుంచి గెలిచిన అనిల్ కాంగ్రెస్ లో చేరి విప్ గా పనిచేశారు. గత రెండు సార్లు ఓడిపోయారు. ఈ జిల్లాలో సైతం బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. కాంగ్రెస్ మూడోస్తానానికి పరిమితమైన చెప్పలేము.



ఇక ఖమ్మం జిల్లా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కాస్త ఆశాజనకంగా ఉందనే చెప్పాలి. 2014 , 2018 లో టీఆర్ఎస్ ఒక స్థానానికే పరిమతం చేసిన జిల్లా.. 2014 లో తెలంగాణ వచ్చాక సైతం వైయస్సార్ సీపీని ఆదరించిన జిల్లా ఏకంగా మూడు ఎమ్మెల్యే ,ఒక ఎంపీ స్థానం గెలిచింది. ఆతర్వాత అందరూ టీఆర్ఎస్ లో చేరారు.. అలా కారు తన బలాన్ని పెంచుకొంది..అయినా 2018 లో కాంగ్రెస్ కూటమికే ఖమ్మం ప్రజలు జై కొట్టారు. ఖమ్మం నియోజకవర్గం 2014లో గెలిచిన పువ్వాడ టీఆర్ఎస్ లో చేరారు.క్యాడర్ ఉన్నా ,,లీడర్ లేడు. వైరా నియోజకవర్గం కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం .రెబల్ గా పోటిచేసిన రాములునాయక్ పోటిచేసి గెలుపొంది టీఆర్ఎస్ లో చేరారు.ప్రస్తుం బాలాజీనాయక్, రాందాస్ నాయక్ ఇద్దరు పోటిపడుతున్నారు. మధిర నియోజకవర్గంలో సీఎల్పీనేత భట్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీపీఐ సీపీఎం, టీడీపీ పార్టీలతో సాన్నిహిత్యం భట్టి గెలుపుకు దోహడపడుతోంది. పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. 99 నుంచి కాంగ్రెస్ ను గెలుపిస్తున్నారు . 2014 లో రామిరెడ్డి వెంకటరెడ్డి మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తుమ్మల గెలిచారు.2018 లో కాంగ్రెస్ నుంచి ఉపేందర్ రెడ్డి గెలిచి టీఆర్ఎస్ లోచేరారు. బలమైన క్యాడర్ లీడర్ లేని పార్టీగా మిగిలింది.



సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆగమ్యగోచరపరిస్ధితి. సత్తుపల్లి నుంచి మూడుసార్లు టీడీపీ గెలుపొందింది. 2018 ఎన్నికల అనంతంరం సండ్ర టీఆర్ఎస్ లోచేరారు. ఇక్కడ కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది.ఇల్లందు నియోజకవర్గం 2014 2018 రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. కోరం కనుకయ్య 2014 లో గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. 2018 లో గెలిచిన హరిప్రియనాయక్ సైతం టీఆర్ఎస్ లోచేరారు. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉందనే చెప్పాలి. టీఆర్ఎస్ కోరంకనుకయ్య ,హరిప్రియవర్గాలుగా మారిపోయింది.. కొత్తగూడెం సైతం కాంగ్రస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు.నాలుగు సార్లు వనమా వెంకటేశ్వర్రావు గెలుపొందారు..2018 లో గెలిచిన వనమా టీఆర్ఎస్ లోచేరారు. పోట్ల నాగేశ్వర్రావు, ఎడవల్లి కృష్ణ ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు. వనమాకు సన్ స్టోక్ ఎఫెక్ట్ ఏ మేరకు పనిచేస్తోందో చూడాలి. భద్రాచలం లో గత రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. పోడెం వీరయ్య 2018 లోగెలిచారు. సిట్టింగ్ అభ్యర్ది గా ఉన్నారు. పార్టీ బలంగా ఉందనేచెప్పాలి. పినపాక నియోజకవర్గం నుంచి గెలిచిన రేగా కాంతారావు టీఆర్ఎస్ లోచేరారు,కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉన్నప్పటికి న్యాయకత్వ సమస్య వెంటాడుతోంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు సూర్య పినపాకనుంచి పోటి చేసేందుకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆశ్వారావు పేట లో సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జెట్పీటీసీ సున్నం నాగమణి టికెట్ ఆశిస్తున్నారు.


కరీంనగర్ , ఆదిలాబాద్ , నిజామాబాద్ , వరంగల్ ,ఖమ్మం జిల్లాలో 55 స్థానాలున్నాయి.. ఒక్క ఖమ్మం లో మాత్రమే ఆశాజనకంగా ఉంది. మిగితా చోట్ల న్యాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ పార్టీ మెల్లమెల్లగా హస్తం పార్టీ ని కనుమరుగు చేసేందుకు ప్లాన్స్ వేస్తోంది. ఆదిలాబాద్ ,నిజామాబాద్ , వరంగల్ , కరీంనగర్ జిల్లాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు మెజార్టీ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. సహజంగా ఉండే ఎమ్మెల్యేల పై ఉన్నా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే సమిష్టి న్యాయకత్వంతో పోరాడాల్సి ఉంటుంది..లేకుంటే బీజేపీ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది..



మార్గం శ్రీనివాస్

Tags

Read MoreRead Less
Next Story