KTR : రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

KTR :  రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌
X
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం..

పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ (కేటీఆర్‌) అన్నారు. ఎక్స్‌ వేదిగా నిర్వహించిన ‘ఆస్క్‌ కేటీఆర్‌’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోని అనేక పార్టీల నేతలు ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరేప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కేటీఅర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కాంగ్రెస్ పాలన తెలంగాణకు ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ఏమాత్రం లేదు. అందుకే అబద్ధాలు, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నది. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్‌గా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.

నాలుగేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని కేటీఆర్‌ అన్నారు. అయితే కొత్త ప్రభుత్వానికి ప్రస్తుత సర్కార్‌ చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలు వ్యవసాయ రంగం, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగిత పెరిగిందన్నారు. తెలంగాణ నుంచి అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోతున్నాయని చెప్పారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం అప్పుడప్పుడే సాధ్యం కాదు అన్నారు.

Tags

Next Story