CONGRESS: క్షేత్రస్థాయిలోకి కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి

కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో కార్యాచరణలోకి దిగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలకు శ్రీకారం చూడుతున్నారు. తొలుత గాంధీభవన్‌లో మెదక్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భేటీలో మీనాక్షి పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ బలోపేతానికి ఏ చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు. మంగళవారం హైదరాబాద్‌కు రానున్న మీనాక్షి నటరాజన్.. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతారు. ఆమెతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా..? లేదా..? అన్నదానిపై ఆమె ఆరా తీయనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అలాగే సంక్షేమ కార్యక్రమాల ప్రచారాన్ని ప్రజల దాకా తీసుకెళ్లడంలో ఎక్కడ విఫలమవుతున్నదీ సమీక్ష చేయనున్నట్లు వెల్లడించాయి.
కార్యకర్తలకు న్యాయం జరగాలి..
నాయకులు ఫ్లెక్సీలు, ఫొటోలు పెడితే ఎన్నికల్లో గెలవరని, నిరంతరం ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని ఇప్పటికే మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నామని.. పేదవారి ముఖంలో నవ్వులు చూసినప్పుడే పనిచేసినట్టు అర్థమని తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని... అవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలన్నారు. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగాలన్నారు.
కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. గీత దాటితే వేటు తప్పదనేలా వ్యవహరిస్తున్నారు. అలా బాధ్యతలు చేపట్టడం.. ఇలా తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేయడంతో కాంగ్రెస్ నేతలు అలెర్ట్ అయ్యారు. గాంధీ భవన్ లో ఎలాంటి ఫ్లెక్సీలు ఉండొద్దని ఇప్పటికే ఆదేశించిన మీనాక్షి... కుల సమావేశం పెట్టిన వీహెచ్ ను వివరణ కోరారు. మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో ఒక్క సోనియాగాంధీ కటౌట్ తప్ప మిగతావన్నీ తొలగించేశారు. పార్టీ ఏర్పాటు చేసిన ఇన్నోవా కారులో గాంధీభవన్‌కు వచ్చిన ఆమె తిరిగి వెళ్లేప్పుడు.. వ్యక్తిగత పని ఉందని ప్రైవేటు కారులో వెళ్లిపోయారు. రాత్రికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com