CONGRESS: అసంతృప్తులకు కాంగ్రెస్‌ బుజ్జగింపులు

CONGRESS: అసంతృప్తులకు కాంగ్రెస్‌ బుజ్జగింపులు
X
మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్‌ నేతల ఫోన్.. పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ వినతి

తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి నిరాశకు లోనైన ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం చేపట్టింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురికి కేబినెట్‌లో చోటు దక్కింది. ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో చోటు లభించక నిరాశకు లోనైన సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం బుజ్జగించాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తానని, రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని ప్రకటించి, సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడి, ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటికి వెళ్లి సమస్యను చర్చించి, పార్టీలో ఐక్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నారు.

కాంగ్రెస్‌ను కాపాడింది మేమే

పదేళ్లు బీఆర్‌ఎస్‌తో కొట్లాడమని, కాంగ్రెస్‌ను కాపాడింది తామేనని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆయన మంత్రిపదవి ఆశించి భంగపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగించారు. అనంతరం మల్‌రెడ్డి రంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ లైన్‌లోనే ఉంటామన్న ఆయన.. పది ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులివ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘మా మొర అధిష్ఠానం వినలేదు. పార్టీలో కొత్తవాళ్లకు పదవులిస్తే.. కార్యకర్తలు బాధపడతారు. పార్టీకి ఇబ్బందికర పరిస్థితి వస్తోంది. ఇచ్చిన జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదువులు ఇస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు గతంలో ఆరుగురు మంత్రులుండేవారు. మా బాధను అధిష్ఠానానికి చెప్పే అవకాశం పీసీసీ చీఫ్ ఇవ్వాలి. నా సామాజికవర్గమే అడ్డొస్తే.. పార్టీ కోసం పదవి త్యాగం చేస్తాం’’అని రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ల నుంచి ఎవరికీ మంత్రి పదవి రాకపోవడంతో, ఈ జిల్లాల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాసి, క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని నూతన మంత్రులను ఎంపిక చేసింది. దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్‌ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (మాదిగ), బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం కల్పించారు.

Tags

Next Story