Telangana: నామినేటెడ్ పదవుల సర్దుబాటుపై స్వయంగా సీఎం ఫోకస్

Telangana: నామినేటెడ్ పదవుల సర్దుబాటుపై   స్వయంగా సీఎం  ఫోకస్
రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల పదవులు రద్దు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో... పీసీసీ పదవితోపాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్‌ పదవుల కోసం నాయకులు బారులు తీరుతున్నారు. టికెట్లు త్యాగం చేసిన వారితోపాటు.. పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నాయకులు కూడా పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వారికి... పదవులు ఇస్తామని హామీలిచ్చిన వారికి కూడా సర్దుబాటు చేయాల్సి ఉండడంతో... స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డినే నిశితంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పదేళ్లపాటు పాలన కొనసాగించిన brs ను ఎదురొడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కోసం.. రాష్ట్ర నాయకత్వంతోపాటు జాతీయ నాయకత్వం తీవ్రంగా శ్రమించాయి. PCC అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి, మిగిలిన కీలక నేతలు పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో పని చేశారు. అధికార పార్టీని ఎదురొడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడంతోనే.. సాధ్యమైందన్న భావన రాష్ట్ర నాయకత్వానికి ఉంది. ఈ నెల 7న ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో... ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, సాధారణ పరిపాలనకు అవసరమైన నిధులను.. మినహాయించి అందుబాటులో ఉన్న నిధులను మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు ఉపయోగించేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆర్థిక వెసులుబాటు ఆధారంగా రైతు బంధు అమలు, మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు.. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story