TS: తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!

TS: తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!
కోదండరాం, జాఫర్‌ జావీద్‌కు ఎమ్మెల్సీ పదవి.... ఆమోదించిన కాంగ్రెస్‌ అధిష్టానం

తెలంగాణలో MLC ఎన్నికల బరిలో నిలిచే నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం. వీటితో పాటు 10 ప్రధానమైన నామినేటెడ్ పదవులకు కూడా నాయకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ప్రధానకార్యదర్శి K.C.వేణుగోపాల్‌తో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.... A.I.C.C అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై జాబితాకు ఆమోదముద్రవేయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో గవర్నర్ కోట కింద రెండు MLCలు, ఎమ్మెల్యే కోట కింద రెండు MLCలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నాలుగు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపికపై కొన్ని రోజులుగా కొనసాగిన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వ కసరత్తుకు...అధిష్ఠానం ఆమోదంతో తెరపడినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన అభ్యర్థులకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయన్న కారణం చూపి ఆమోద ముద్ర వేయకుండా గవర్నర్ తిప్పి పంపారు. దీంతో ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి.


ప్రొఫెసర్‌గా విద్యారంగంలో సేవలందించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, విద్యరంగంలో సేవలందిస్తున్న జాఫర్ జావీద్, ప్రముఖ పత్రిక అధినేత అమీర్ అలీఖాన్, ప్రముఖ మస్కతి డైరీ సంస్థ యజమాని మస్కతి, AICC మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫయీమ్ ఖురేషి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రొఫెసర్ కోదండరాం పేరుతో పాటు మరో మైనార్టీ నాయకుడి పేరు ఆమోదం పొందినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీల్లో.. ఒకటి బీసీ, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చేందుకు ఆమోదం లభించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప దాస్‌మున్షి, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు MLC అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఈ ముగ్గురు.. చర్చించిన పేర్ల జాబితాను ఆయన ముందుంచినట్లు తెలుస్తోంది.


ఈ జాబితాలో లేని పేరును కేసీ వేణుగోపాల్‌ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభావంతమైన మైనార్టీ నాయకులు ఉండాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన నాయకులతోపాటు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి నిరాశకు గురైన నాయకులకు ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవులు భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రధానమైన 10నామినేట్ పదవుల భర్తీకి అధిష్టానం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా కింద ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన నాయకుల పేర్లు కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story