Congress: ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్.. పొత్తులు లేకుండానే బరిలోకి..

Congress: ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్.. పొత్తులు లేకుండానే బరిలోకి..
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నేతృత్వంలో వరుస కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. 12 నెలల్లో అధికారం తమదేనంటూ ధీమాతో జనంలోకి వెళుతోంది. వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ తరువాత ఈ దూకుడు మరింత పెంచింది. అగ్రికల్చర్ డిక్లరేషన్‌కి మంచి స్పందన రావడంతో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు రచ్చబండ కార్యక్రమంతో ఫైర్ పెంచింది. ఇక రెండు రోజుల పాటు చింతన్ శిబిర్‌ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్‌.. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనవి మూడు నెలల ముందే మ్యానిఫెస్టో, ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన.

ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఉమ్మడి జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ నుంచి ఇందిర, నర్సంపేట సెగ్మెంట్‌లో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేసులో ఉన్నారు. మహబూబాబాద్‌ నుంచి బెల్లయ్య నాయక్ టికెట్ ఆశిస్తున్నప్పటికీ.. పోరిక సాయిరాం శంకర్, మురళి నాయక్ కుడా పోటీలో ఉన్నారు. వరంగల్ వెస్ట్‌లో వేము నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ.. చివరి నిమిషంలో ఎవరైనా తెరపైకి రావొచ్చనే టాక్ ఉంది.

వరంగల్ ఈస్ట్‌లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. పరకాలలో కొండా సురేఖ, పాలకుర్తిలో జంగా రాఘవరెడ్డి, జనగాంలో పొన్నాల లక్ష్మయ్యతోపాటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ములుగులో సీతక్క, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, డోర్నకల్‌లో రామచంద్ర నాయక్ అభ్యర్థులుగా ఉన్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ లోకల్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో పద్మావతి, నకిరేకల్‌లో ఎస్సీ సెల్ ఛైర్మెన్ ప్రీతం టికెట్ ఆశిస్తున్నారు. సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు.

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన పార్టీ మారితే మరో అభ్యర్థి కోసం వేట తప్పదు. ఇక ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, నాగార్జున సాగర్‌లో తన తనయుడు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇప్పుంచుకొని, తాను మిర్యాలగూడలో నిలబడాలని జానారెడ్డి వ్యూహంతో ఉన్నారు. భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ పోటీలో ఉన్నారు. దేవరకొండలో కిషన్ నాయక్, బాలు నాయక్‌ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి నుంచి చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్‌లో నాగం జనార్దన్ రెడ్డి పోటీపడుతున్నారు.

కొల్లాపూర్‌లో విద్యార్థి నాయకుడు కేతూరీ వెంకటేష్, జగదీశ్వర్ రావు, అభిలాష రావు మధ్య రేసులో గట్టిగా నడుస్తోంది. కల్వకుర్తిలో వంశీచంద్ రెడ్డి, అచ్చంపేలో వంశీ కృష్ణ, జడ్చర్లలో అనిరుధ్ రెడ్డి ఉండగా.. ఎర్ర శేఖర్ పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉండటంతో ఆయన కూడా జడ్చర్ల టికెట్ అడిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మహబూబ్ నగర్ నుంచి ఒబెడుల్లా కొత్వాల్, ఎన్‌పి వెంకటేష్, సంజీవ్ టికెట్ రేసులో ఉన్నారు. దేవరకద్రలో జీఎంఆర్, ప్రదీప్ కుమార్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. నారాయణ్ పేట్‌లో డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, షాద్ నగర్‌లో ఈర్లపల్లి శంకర్, గద్వాల్‌లో రాజీవ్ రెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, అలంపూర్‌లో సంపత్ కుమార్ పోటీలో ఉన్నారు.

మక్తల్‌లో మాత్రం ప్రశాంత్ రెడ్డి, శ్రీహరిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ నుంచి తిరుపతి రెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, పఠాన్ చెరు నుంచి శ్రీనివాస్ గౌడ్, నారాయణ్ ఖేడ్ నుంచి సురేష్ షట్కర్, సంజీవ్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నర్సాపూర్‌ టికెట్‌ కోసం గాలి అనిల్, రాజిరెడ్డి రేసులో ఉన్నారు. గజ్వేల్ నుంచి నర్సారెడ్డి, సిద్దిపేట నుంచి భవానీ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ లోకల్‌లో ఇప్పటికీ అభ్యర్థి లేదు.

నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి ఉండగా ఖానాపూర్ నుంచి భరత్ చౌహాన్, చారులత రాథోడ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ముదోల్ నుంచి రామారావు పాటిల్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. చెన్నూర్‌లో టీఆర్ఎస్ నుంచి వచ్చిన నల్లాల ఓదెలు టికెట్ తనకే అని చెబుతుండగా.. బోడ జనార్ధన్ తాను కూడా రేసులో ఉన్ననంటున్నారు. ఇక బోధ్ నుంచి అనిల్ జాదవ్, సిర్పూర్ నుంచి కొంకిరాల సురేఖ, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్ ఉన్నారు. కాని ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిని వెతుక్కోవాల్సిన పరిస్థితి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ నుంచి కాసుల బాలరాజు, జుక్కల్ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం, నిజామాబాద్ అర్బన్ నుంచి మహేష్ గౌడ్, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, బాల్కొండలో మాజీ ఎమ్మెల్యే అనిల్ ఉన్నప్పటికీ.. కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి టికెట్ కావాలంటున్నారు. ఆర్మూర్, బోధన్‌లో కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థులే కనిపించడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్ నుంచి మల్ రెడ్డి రాంరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు.

మేడ్చల్ నుంచి హరివర్థన్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపుర్ నుంచి భూపతి రెడ్డి, నర్సారెడ్డి, కొలను హన్మంత్ రెడ్డి, కూకట్ పల్లి నుంచి శ్రీరంగం సత్యం, వెంగల్ రావు, శేరిలింగంపల్లి నుంచి కోటoరెడ్డి వినయ్ రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, తాండూర్ నుంచి మర్రి ఆదిత్య రెడ్డి, రమేష్ ముదిరాజ్, ఇబ్రహీం పట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, మహేశ్వరం నుంచి దేప భాస్కర్ రెడ్డి, చల్లా నర్సింహా రెడ్డి, ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, బి.లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, చేవెళ్ల నుంచి జైపాల్, సిద్ధేశ్వర్, రాజేంద్రనగర్ నుంచి బోర జ్ఞానేశ్వర్, ముంగి జైపాల్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం లోకల్ నుంచి జావిద్, మానుకొండ రాధాకిషోర్ టికెట్ రేసులో ఉన్నారు. మధిర నుంచి భట్టి విక్రమార్క, పాలేరు నుంచి శ్రీనివాస్ యాదవ్, వైరా నుంచి రాందాస్ నాయక్, సత్తుపల్లి నుంచి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ టికెట్ రేసులో ఉన్నారు. అశ్వారావు పేట నుంచి సున్నం నాగమణి, వగ్గెల పూజ, కొత్తగూడెం నుంచి ఎడవల్లి కృష్ణ, ధర్మారావు, ఇల్లందు నుంచి చీమల వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ నాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక పినపాక నుంచి చందా సంతోష్ ఉండగా భద్రాచలం నుంచి పోడెం వీరయ్య అభ్యర్థిగా ఉన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఎం.సత్యనారాయణ మనుమడు కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంథని నుంచి శ్రీధర్ బాబు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి బొమ్మ శ్రీరామ్, హుజురాబాద్‌లో బల్మూర్‌ వెంకట్, సిరిసిల్లలో KK మహేందర్ రెడ్డి, చొప్పదండిలో మేడిపల్లి సత్యం, మానకొండూరులో కౌవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండంలో జనక్ ప్రసాద్, రాజ్ ఠాకూర్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పెద్దపల్లిలో విజయ రమణా రావు, ధర్మపురిలో లక్ష్మణ్, కోరుట్లలో జువ్వాడి నర్సింగ్ రావు రేసులో ఉన్నారు.

హైదరాబాద్ జిల్లాలో పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నుంచి పెద్దగా పోటీనిచ్చే అభ్యర్ధులు లేరు. అయితే, చార్మినార్ నుంచి షేక్ ముజీబుల్లా, వెంకటేష్ టికెట్ ఆశిస్తున్నారు. చాంద్రాయణ గుట్టలో ఇసాబిన్ మిశ్రి, నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్, ఖార్వాన్-ఉస్మాన్ హల్ హజ్రి, యూసుఫ్ జహి, బహుదూర్ పురాలో ఖలీమ్ బాబా, యాకత్‌పురాలో రాజేంద్ర రాజు ఉండగా, గోషామహల్ నుంచి పీసీసీ ఫిషర్ మెన్ కమిటీ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్ టికెట్ రేసులో ఉన్నారు. ఇక ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్, రోహిన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్ రెడ్డి, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఆదం సంతోష్, ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, అంబర్ పేటలో నూతి శ్రీకాంత్ గౌడ్ అభ్యర్ధులు ఉన్నారు. ఇక కంటోన్మెంట్‌లో మల్లు రవి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా మలక్ పేట్‌లో మాత్రం కాంగ్రెస్‌కు అభ్యర్థి లేరు. మొత్తానికి 119 నియోజకవర్గాల్లో మెజారిటీ సెగ్మెంట్లలో గట్టి పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థులు ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది.

అయితే కొన్ని నియోజకవర్గాలో అభ్యర్థులు నామమాత్రంగా ఉన్నారనే చెప్పాలి. కాగా నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికీ సరైన అభ్యర్థులు లేరు. అయితే ఆఖరి నిమిషంలో బీ ఫామ్ మారే సంస్కృతి ఉన్న కాంగ్రెస్‌లో ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన చేసి వారితో గట్టిగా పని చేయించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు లేకపోలేదు. ఏదేమైనా పాత ఆనవాయితీకి ఇకనైనా పుల్ స్టాప్ పడుతుందని ధీమాగా చెబుతున్నారు టీకాంగ్రెస్ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story