Rajagopal Reddy : పది పదిహేను రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy : కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కొనసాగుతోంది.. దీంతో నల్గొండ జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి.. చర్చిద్దాం రమ్మని ఢిల్లీ నుంచి అధిష్ఠానం ఆహ్వానించినా ఆయన వెళ్లలేదు.. దీంతో సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. రాజీనామా చేస్తానని డైరెక్ట్ చెప్పకపోయినా రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని చెప్పడం వెనుక మర్మం అదే అయివుండొచ్చని ఆయన గురించి తెలిసిన వారు చెప్తున్నారు.
కొద్దిరోజులుగా మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలు, సన్నిహితులతో చర్చలు జరుపుతున్న రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మారడంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.. పార్టీ మారడంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదుగానీ.. రాజీనామాపై మాత్రం పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.. ఈనేపథ్యంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ భావిస్తే ఉపఎన్నిక రాదని.. మునుగోడు ప్రజలు కోరుకుంటే వస్తుందంటూ కామెంట్స్ చేశారు.. మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలన్నారు. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదని.. కేసీఆర్ కుటుంబానికి, ప్రజల మధ్య జరిగే ధర్మ యుద్ధమని అన్నారు.
అమిత్‌షాతో తాను రాజీనామా గురించి మాట్లాడలేదని.. మునుగోడులో జరిగే యుద్ధంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందన్నారు. కేసీఆర్‌కు బుద్ది చెప్పే ఎన్నిక వస్తుందని.. దీనిపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరగాలన్నారు. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడబోరని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్తూనే ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డితో చర్చలు విఫలం అని చెప్పడం సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆయన్ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని అంటున్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్పలేదని.. ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటాడని భావిస్తున్నట్లు భట్టి విక్రమార్క అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com