TG: నామినేషన్ దాఖలు చేసిన విజయశాంతి

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీలు ప్రకటించేశాయి. నేటితో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అవడంతో ఆయా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపికైన అభ్యర్ధులు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
మేం ఉద్యమకారులం: విజయశాంతి
గతంలోనూ తాను కాంగ్రెస్ పార్టీలో పని చేశానని.. కానీ ఏనాడూ ఇది కావాలని పార్టీని అడగలేదని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేశామని.. సీఎం రేవంత్ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చానని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్‌పై విజయశాంతి విమర్శలు గుప్పించారు. తాము తెలంగాణలో ఉద్యమకారులమని, ఉద్యమకారిణిగా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ నాయకుల్లా అడుక్కోవడానికి తామేం బిచ్చగాళ్ళం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అందుకే తాను బీజేపీ నుంచి బయటకి వచ్చినట్టు గుర్తుచేశారు.
అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు
తనకు అవకాశం రావడంతో చాలా మంది వాళ్ల ఇంట్లో బిడ్డకు వచ్చినట్టు ఆనంద పడుతున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. తాను చేసిన సేవలకు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. తనకు ఈ అవకాశం లేట్ గా వచ్చినా ప్రజలకు సేవ చేయడానికి పార్టీ ఇచ్చిన అదనపు బాధ్యతగా చూస్తున్నానని తెలిపారు. అలాగే ఒక వేళ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోయినా కూడా ప్రజల కోసం పోరాడేవాడినని, ప్రజలతో లేకపోతే తాను బతకలేనని వ్యాఖ్యానించారు. మంత్రిగా అవకాశం దక్కుతుందనేది ప్రస్తుతానికి వార్తలు మాత్రమేనని తెలిపారు. మంత్రి పదవి అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com