CONGRESS: ప్రజల తెలంగాణ లక్ష్యంగా ముందుకు కదలండి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల కీలక సమావేశం ఢిల్లీలో జరిగింది. ఖర్గే నివాసంలో సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల పాలన, పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు, పార్టీ నాయకులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్న కీలక నిర్ణయాలు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వివరాలు అందించారు.
నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం నేతలకు కీలక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం, కేడర్‌ను చైతన్యపరచడం, ప్రజలతో మరింత అనుసంధానం పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహా, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన విజయాలు పార్టీకి ఉత్సాహాన్ని నింపాయని ఖర్గే పేర్కొన్నారు.
సమానత్వంతో కూడిన “ప్రజల తెలంగాణ” నిర్మాణమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నేతలు పునరుద్ఘాటించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం, పారదర్శక పరిపాలన అందించడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా నిలిచిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
