Congress: లోక్‌సభ బరిలో కొత్త అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై దృష్టిసారించి కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలిని మల్కాజిగిరికి ఓ వ్యాపారవేత్త పేరును పరిశీలించి రంగంలోకి దింపే యోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొన్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని యత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించినా కొన్ని లోక్‌సభ స్థానాల పరిధిలో విపక్ష భారాస, భాజపా కంటే తక్కువఓట్లు వచ్చాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో MIM ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ను మినహాయిస్తే మిగిలిన 16 స్థానాలకు గాను 9చోట్ల కాంగ్రెస్‌కు, 7చోట్ల భారాసకు ఆధిక్యం లభించింది. ఆధిక్యం లభించని చోట బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉంది.
ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వర్గానికి చెందిన ఓ వైద్యురాలిని రంగంలోకి దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. మరో టీచర్ పేరు పరిశీలనకు వచ్చినా వైద్యురాలివైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో భాజపా కంటే భారాసకు 17వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాంగ్రెస్‌కు ఆ రెండుపార్టీల కంటే రెండు లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. దీంతో ఆదిలాబాద్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. మల్కాజిగిరి పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను భారాస గెల్చుకుంది. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కంటే మూడున్నర లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ లోక్‌సభ స్థానం సీఎం రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో గెలవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. వ్యాపారవేత్త అయిన ఓ మాజీMLAని రంగంలోకి దించే అంశంపరిశీలిస్తున్నట్లు తెలిసింది.
సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కస్థానం లభించలేదు.మొత్తం ఓట్లలో లక్షా 80వేలు తక్కువగా వచ్చాయి. ఇక్కడి నుంచి అనిల్‌కుమార్ యాదవ్ పేరు పరిగణనలోఉన్నా, మరో బలమైన అభ్యర్థి దొరికితే మార్చే అవకాశాలున్నాయి. నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో మూడుపార్టీలకు ఓట్లు పోటాపోటీగా వచ్చినా కాంగ్రెస్ కంటే 9వేల ఓట్లు భారాసకు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ MLC జీవన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తక్కువ ఓట్లతేడాతో ఓడిపోయిన విశ్వేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం భాజపాలో ఉన్నారు. ఆయన తిరిగివచ్చేఅవకాశం లేదని భావిస్తున్న కాంగ్రెస్.. మరో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని చేర్చుకొని అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com