రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుపులు.. చివరకు..

రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుపులు.. చివరకు..
X
అదిష్టానం పంపిన నోట్ బయటపడడంతో చల్లబడ్డ నేతలు

పాదయాత్రలతో తెలంగాణ కాంగ్రెస్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రైతు ఎజెండాగా ఎవరికి వారే పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. రేవంత్ చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్ష కాస్తా పాదయాత్రగా మార్పు చెందింది. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుస్తున్నా..అధిష్టానం సూచనతోనే పాదయాత్ర చేస్తున్నానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పాదయాత్రలతో రైతుల వద్దకు వెళ్లాలని అదిష్టానం పంపిన నోట్ బయటపడడంతో నేతలు చల్లబడ్డారు. అటు వెంటనే రైతు ఎజెండాతో జనంలోకి వెళ్లేందుకు ఇతర నేతల కార్యచరణ రూపొందించే పనిలో పడ్డారు.

రైతులతో సీఎల్పీ పక్షాన భట్టి విక్రమార్క ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేసేలా తమ ప్రణాళిక ఉంటుందని భరోసా ఇచ్చారు. అటు సంగారెడ్డి నుంచి ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేసేందుకు జగ్గారెడ్డి రెడీ అవుతున్నారు. మరోవైపు ఈ నెల 20 నుండి 26వ‌ర‌కు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పాద‌యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టుల సాధ‌న యాత్ర పేరుతో పాదయాత్రకు కోమటిరెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బ్రా‌హ్మణవెల్లెంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఎవరికివారే యాత్రలకు సిద్ధమవుతున్నా.. కాంగ్రెస్‌లో వర్గ పోరు మాత్రం తగ్గలేదు. సీఎల్పీ పక్షాన భట్టి చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు. అటు రేవంత్ పాదయాత్రవైపు ఉత్తం, భట్టి, కోమటిరెడ్డి బ్రదర్స్, విహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. రేవంత్ పాదయాత్ర ఫెయిల్యూర్ అంటూ హైకమాండ్‌కు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్‌ పాదయాత్రలో జనాదరణకు..పార్టీ నేతల ఫిర్యాదులకు పొంతన లేకపోవడంతో ఢిల్లీ నేతలు అవాక్కవుతున్నారు. పాదయాత్ర ముగింపులో ఈనెల 16న రావిర్యాలలో రేవంత్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేవంత్ సభకు పార్టీలో ముఖ్య నేతలు ఎవరెవరు హాజరవుతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం నేతల పాదయాత్రలతో కాంగ్రెస్‌లో రాజకీయం జోరందుకుంది. రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుపులు.. బయటపడ్డ అదిష్టానం పంపిన నోట్

Tags

Next Story