TPCC: అక్టోబర్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్టోబర్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. సోనియాగాంధీ విజయభేరీ సభా వేదికగా ప్రకటించిన 6గ్యారంటీలపై విస్తృత ప్రచారం కల్పించడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బస్సుయాత్ర చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, CLP నేత భట్టి విక్రమార్కతోపాటు ఇతర సీనియర్ నాయకులంతా ఇందులో పాల్గొననున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి బస్సు యాత్ర చేపట్టాలని ప్రాథమికంగా తీర్మానించిన నేతలు.. యాత్రకు సంబంధించిన తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. . బస్సు యాత్రతో సమాంతరంగా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఢిల్లీలో కాంగ్రెస్ వార్ రూంలో ఇప్పటికే సమావేశమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ, ఓటింగ్ ఉండడంతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ రాలేకపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు మణిక్‌రావ్ ఠాక్రే, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవానీ, బాబా సిద్దిఖీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీగౌడ్, ఎంపీలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాథమికంగా చర్చించారు. చర్చ జరుగుతున్న సమయంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ ప్రారంభమవడంతో రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ వెళ్లిపోయారు. అనంతరం మిగతా సభ్యులు కొంతసేపు చర్చించి, సమావేశాన్ని ముగించారు. లోక్‌సభలో బిల్లులు, చర్చల ఆధారంగా ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఆధారపడి ఉంటుందని భట్టి తెలిపారు. ఈ దఫా అభ్యర్థుల ఎంపిక వేగంగానే చేస్తామని, తొలి విడతలో 50 నుంచి 55 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సమాలోచనలు కొనసాగుతున్నాయి. ఒకే పేరు కలిగిన 30నియోజకవర్గాల జాబితాను స్ర్కీనింగ్ కమిటీ... పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించే అవకాశం ఉంది.
మరోవైపు స్క్రీనింగ్ కమిటీలో అనూహ్య మార్పులు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం... కమిటీలో మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు చోటు కల్పించారు. కీలక కమిటీల్లో చోటు కల్పించలేదని ఎంపీ కోమటిరెడ్డి ఇటీవల పార్టీముఖ్యనేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే స్క్రీనింగ్ కమిటీలోకి ఇద్దరు నేతలను తీసుకున్నారు. టికెట్ల విషయంలో ఎలాంటి వివాదస్పదం లేని ఒకేపేరు కలిగిన దాదాపు 30 నియోజక వర్గాల జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com