జీవన్ రెడ్డికి బర్త్ డే గిఫ్ట్ గా పీసీసీ చీఫ్ పదవి?

జీవన్ రెడ్డికి బర్త్ డే గిఫ్ట్ గా పీసీసీ చీఫ్ పదవి?
నేడు జీవన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయనకు బర్త్ డే గిఫ్ట్ గా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేడు జీవన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయనకు బర్త్ డే గిఫ్ట్ గా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ పదవి జీవన్ రెడ్డికి ఖాయమైందనే ప్రచారంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

తాటిపర్తి జీవన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ నేతగా 40 సంవత్సరాలనుంచి రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా ప్రాచుర్యం పొందారు. 1981లో రాజకీయాల్లో ప్రవేశించిన జీవన్ రెడ్డి.. మల్యాల పంచాయితీ సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికై అంచెలంచెలుగా ఎదిగారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2018 ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసిందనే వార్తల సంగతి ఎలా ఉన్నప్పటికీ, యాధృచ్ఛికంగా ఆయన బర్త్ డే కూడా కలసి రావడం విశేషంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుని రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అకస్మాత్తుగా జీవన్ రెడ్డి పేరు తెరపైకి రావడం గమనార్హం. నేటి సాయంత్రం లోపు జీవన్ రెడ్డి పేరుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జీవన్ రెడ్డి ఎంపికకు సంబంధించి నియామక పత్రంపై సోనియాగాంధీ సోమవారం రాత్రి సంతకం కూడా చేశారనేది తాజా సమాచారం.

వారం రోజుల క్రితమే జీవన్ రెడ్డినీ పార్టీ అధిష్టానం పిలిపించుకునీ చర్చించినట్లు సమాచారం. వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఫోన్ చేయడంతో.. జీవన్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. పార్టీ సారథ్య బాధ్యతల అంశం ప్రస్తావన వచ్చినపుడు, తాను పార్టీకి విధేయుడినని, అప్పగించిన ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక బలం అనే అంశంపైనా పార్టీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కొందరు నాయకులు అండగా ఉంటారని పార్టీ ముఖ్యులు భావించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జీవన్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ గా ఎంపిక పూర్తయిందని, ప్రకటన లాంఛనమేనంటున్నారు.

ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇదే జిల్లాకు చెందిన జీవన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌ గా నియమించి ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story