CONGRESS: ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌కు తలనొప్పి..!

తెలంగాణ రాజకీయాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకప్పుడు వ్యూహాత్మక విజయం అని భావించిన నిర్ణయమే, ఇప్పుడు పార్టీని లోపలినుంచి కుదిపేస్తున్న సమస్యగా మారింది. బలమైన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోగా, ప్రస్తుతం ఆ నిర్ణయమే మింగుడు పడని మెతుకులా మారిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు వారు సాంకేతికంగా కాంగ్రెస్‌లో లేరని, ఇంకా తమ పాత పార్టీకే చెందామని చెబుతున్న పరిస్థితి పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ పది మందిలో చాలామంది అదే వైఖరిని క్షేత్రస్థాయిలోనూ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నితీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది.
కాంగ్రెస్‌కు దూరంగా...
పటాన్ చెరు, గద్వాల వంటి నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా తయారైంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ, ఈ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక నాయకులతో సమావేశాలు లేకపోవడం, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడం వంటి అంశాలు క్యాడర్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. మరికొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సహకరిస్తామనే సంకేతాలు ఇవ్వడం కాంగ్రెస్ అధిష్టానాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ఇది ఒక్కటి రెండు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. జగిత్యాల వంటి నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ కార్యకర్తలకు, కొత్తగా వచ్చిన నేతలకు మధ్య తీవ్ర సమన్వయ లోపం కనిపిస్తోంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులు, నిన్న మొన్నటివరకు ప్రత్యర్థిగా ఉన్న నేతల కింద పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతోంది. ఈ అంతర్గత విభేదాలు ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే ఆత్రుతలో, సరైన వడపోత లేకుండా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాంగ్రెస్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
