TPCC: కాంగ్రెస్‌కు చల్లారని అసమ్మతి సెగ

TPCC: కాంగ్రెస్‌కు చల్లారని అసమ్మతి సెగ
టికెట్లు దక్కని నేతల రాజీనామాలు.... రెబల్ పోటీ చేస్తామని హెచ్చరికలు... బుజ్జగిస్తున్న అధిష్టానం

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల అసమ్మతి సెగ తగ్గడం లేదు. అసమ్మతివాదులు అనుచరగణంతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్‌ కార్యాచరణకు సిద్దమవుతున్నారు. కొందరు రాజీనామా చేస్తుంటే... మరికొందరు టికెట్‌ ఇవ్వకుంటే రెబల్‌గా పోటీ చేసి తీరతామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీకి నష్టం జరగకుండా ముఖ్యనేతలు రంగంలోకి దిగి టికెట్లు దక్కని వారికి బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటన సమయంలో పెద్దగా అసంతృప్తి కనిపించలేదు. ఎక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉండటంతో ఆశావహుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఐతే 45మందితో ప్రకటించిన రెండో జాబితాలో సీటు రాని నేతలు భగ్గుమంటున్నారు. నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీ సీటు ఆశించి భంగపాటుకు గురైన నాగం జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మంత్రులు హరీష్‌రావు, KTRలు ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చి ప్రగతిభవన్‌ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి KCRతో నాగం భేటీ అయ్యారు. టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేసిందని నాగం ఆరోపించారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. జూబ్లీహిల్స్ సీటు రాకపోవడంతో అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి సీఎం KCRను మర్యాదపూర్వకంగా కలిశారు.


మహేశ్వరం టికెట్‌ ఆశించి నిరాశకులోనైన పారిజాత నర్సింహారెడ్డి అనుచరులతో సమావేశమై... కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎల్బీనగర్‌లో దీపా భాస్కర్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, నర్సాపూర్‌లో గాలి అనిల్ కుమార్, తదితరులు అభ్యర్థితత్వం ఖరారు కాక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ టికెట్‌ ఆశించిన గాలి అనిల్‌కుమార్‌ అనుచరులు గాంధీభవన్‌లో నిరసన చేపట్టారు. ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. డోర్నకల్ టికెట్‌ ఇవ్వాలంటూ భూపాల్ నాయక్‌ వర్గీయులు జల దీక్ష చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలను మార్చాలని జీవకన్ వర్గీయులు డిమాండ్‌ చేశారు


టికెట్లు దక్కనివారిని బుజ్జగించేందుకు జానారెడ్డి నేతృత్వంలోని సమన్వయ కమిటీతోపాటు ఐదుగురు AICC ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా అసమ్మతి నాయకుల జాబితా సిద్ధం చేసుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఉండడంతో కొంతమందితో ఫోన్‌లో మాట్లాడుతుండగా మరికొందరిని పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. ఎల్లారెడ్డిని నుంచి రెబల్‌గా బరిలో దిగుతానని ప్రకటించిన సుభాష్‌రెడ్డితో మాట్లాడేందుకు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇంటికి రావాలని జానారెడ్డి అశోక్‌చవాన్‌లు ఆహ్వానించారు. అక్కడకు వెళ్లిన సుభాష్‌రెడ్డి రేవంత్‌రెడ్డి, సీతక్కలు ఫోన్‌ చేసినా స్పందించలేదు.

Tags

Next Story