CONGRESS: మొదటి విడతలో "చేతి"కి చిక్కిన పల్లెలు

తొలి విడత స్థానిక ఎన్నికల్లో అధికార హస్తం పార్టీ జోరు చూపించింది. దాదాపు ప్రతి పల్లెలోనూ పాగా వేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత ఫలితాలు వెలువడ్డాయి.. ఈ యుద్ధంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు చాలా చోట్ల డిపాజిట్ కోల్పోయారు. ఈ ఫలితాల వెనుక క్లియర్ గా సీఎం రేవంత్ రెడ్డి పాలన మార్క్ కనిపించింది. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నా.. సీఎం రేవంత్ సంక్షేమ పథకాల విషయంలో ప్రజల అంచనాలను అందుకున్నారనే అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తొలి రోజునే.. పరిస్థితి ఏమిటి... ఎలా అన్నది ఆలోచించకుండా ఉచిత బస్సును ప్రారంభించేశారు. ఎంత కష్టమైనా భరించక తప్పదన్న ఉద్దేశంతో ఆ పథకం ప్రారంభించారు. రెండేళ్లుగా 90 శాతం మంది మహిళలు ఒక్క సారి అయినా ఈ పథకం ద్వారా లబ్దిపొంది ఉంటారు. పేద మహిళలు ఈ పథకం ద్వారా ఎంతో కొంత మిగుల్చుకుంటారు. ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది. సిలిండర్ పథకం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. ఈ పథకాలు కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థుల విజయంలో చాలా కీలక పాత్ర పోషించాయి. సన్నబియ్యం పథకం మరో బెంచ్ మార్క్. రేషన్ కార్డు మీద సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లపథకాన్నీఅమలు చేస్తున్నారు. దీనితో పల్లె జనం కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది.
కాంగ్రెస్ లో స్థిరత్వం
కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితుల వల్ల తిరుగులేని నేతగా ఎదగడానికి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు కాళ్లు, చేతులు కట్టేస్తూనే ఉంటారు. అయినా రేవంత్ తన పట్టు నిరూపించుకుంటూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడల్లా అండగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సమకూర్చారు. జాతీయ రాజకీయాలకు ఆయన వ్యూహాలే దిక్సూచీ అయ్యాయి. రెండేళ్లలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. రెండింటిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకున్నారు. ఎలా చూసినా..రెండేళ్ల పాలనలో రేవంత్ అద్భుతమైన విజయాలు.. భయపడాల్సినంత పరాజయాలు ఏమీ చూడలేదు.'అయితే ఈ విజయం గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగుతుందా లేదా అన్నది మాత్రమే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలవలేదు. అితే ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం గెలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

