వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం : రేవంత్ రెడ్డి
టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని నిలదీయాలని శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పిలుపునిచ్చారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత, గిరిజన దండోరా సభలు నిర్వహిస్తామని తెలిపారు. సభలను డీసీసీలు సీరియస్‌గా తీసుకోవాలని రేవంత్ సూచించారు. గాంధీ భవన్‌లో డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 10 నుంచి 17 మధ్య రాహుల్‌ను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో దళిత, గిరిజన ఆత్మగౌరవాన్ని కాపాడామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాల్ని... టీఆర్‌ఎస్ సర్కారు నిలిపివేసిందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఅంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ఆపేశారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే... దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేవని అన్నారు. ఇన్నేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు దళిత బంధు పేరుతో పథకం ప్రవేశపెట్టడంపై... ప్రధాన ప్రతిపక్షంగా నిలదీయాలని శ్రేణులకు సూచించారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి... తర్వాత ఎగ్గొడతారని రేవంత్ విమర్శించారు. హైదరాబాద్ వరద బాధితులకు 10వేల రూపాయల చొప్పున సాయం ఇస్తానని... తర్వాత ఎగ్గొట్టారని చెప్పారు. హైదరాబాద్‌లో 10వేల రూపాయలు ఇవ్వలేని కేసీఆర్... 30లక్షల దళిత కుటుంబాలకు 10లక్షల చొప్పున ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని నిలదీయాలని శ్రేణులకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. మండల అధ్యక్షులు ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడాలని సూచించారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు శ్రేణుల పనితీరుపై నివేదికలు తయారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు రచించి... పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 72 సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com