Loan App Suicide : లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య..

Loan App Suicide : తెలుగు రాష్ట్రల్లో లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలయ్యారు. అవసరం కోసం ఆన్‌లైన్ రుణ యాప్‌లో 6వేల అప్పు తీసుకున్న.. అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సొమ్ము సకాలంలో చెల్లించలేదనే నెపంతో నీ భార్య ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే రోజుకు వెయ్యి వస్తాయంటూ ఆ యాప్‌కు చెందిన వ్యక్తులు వేధించారు. దీంతో అవమానం భారంతో సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
జల్‌పల్లికి చెందిన యంజాల సుధాకర్.. ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. అయితే అవసరం కోసం గోల్డెన్ రూపీ అనే రుణయాప్ నుంచి 6వేల రుణం తీసుకున్న సుధాకర్ సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో ఆ యాప్ ఏజెంట్ల నుంచి వేధింపులు మొదలు పెట్టారు. ఎన్నిసార్లు బాకీ సొమ్ము చెల్లించినా ఇంకా బకాయి ఉన్నావంటూ వేధించారు.
అసభ్య పదజాలంతో ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టి మానసికంగా హింసించేవారు. నీ భార్య నంబర్ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే.. ఒక్కో కస్టమర్ నుంచి డబ్బులు వస్తాయని మెసేజ్‌లు పంపేవారు. అంతేకాకుండా సుధాకర్ ఓ మోసగాడు అంటూ అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న పలువురికి మెసేజ్‌లు పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన సుధాకర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com