కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై రచ్చ..!

కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై రచ్చ..!
ఏడేళ్లుగా విపక్షాలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని సీఎం కేసీఆర్‌.. హఠాత్తుగా కాంగ్రెస్‌ నేతలను కలవడం.. హాట్ టాపిక్ మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సీఎం కేసీఆర్‌ కలవడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏడేళ్లుగా విపక్షాలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని సీఎం కేసీఆర్‌.. హఠాత్తుగా కాంగ్రెస్‌ నేతలను కలవడం.. హాట్ టాపిక్ మారింది. అటు కాంగ్రెస్‌లోనూ ఈ అంశం కాక రేపుతోంది. సీఎం కేసీఆర్‌ను భట్టి బృందం కలవడంపై.. కాంగ్రెస్‌లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌తో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లిపోతున్నాయంటున్నారు ఉత్తమ్. ఇదే అంశాన్ని ఎస్సీ సెల్‌ జాతీయ ఛైర్మన్‌ నితిన్‌ రావత్‌ ముందు కూడా ప్రస్తావించారు ఉత్తమ్‌. అయితే... రావత్‌ వెళ్లిపోగానే ఉత్తమ్‌తో సమావేశమైన భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు, జగ్గారెడ్డి.... ఉత్తమ్‌ అభిప్రాయంతో విభేదించినట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని ఓ వైపు కాంగ్రెస్‌ నేతలే వ్యతిరేస్తుండగా... ఈ అంశాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంటోంది. కాంగ్రెస్ ను తాకట్టు పెట్టేందుకే సీఎల్పీ నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లారంటూ విమర్శిస్తున్నారు కమలనాథులు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్​కు బీ టీమ్‌గా కాంగ్రెస్ పని చేస్తుందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీలో సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్న వీహెచ్ మాటలు ఇప్పుడు నిజమయ్యాయన్నారాయన. .

ఓ వైపు బీజేపీ, మరోవైపు సోషల్ మీడియాలో విమర్శలతో దీనిపై సీరీయస్‌ అయ్యారు భట్టివిక్రమార్క. దళిత మహిళ లాకప్‌డెత్ జరిగితే సీఎంను కలవడం తప్పా అని ప్రశ్నించారు. దళిత మహిళ మరణించినా మాట్లాడనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును గెలిపించుకోవడం దుబ్బాక ప్రజల దౌర్భాగ్యమంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గంలో మహిళ మరణిస్తే తాను మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. మొత్తానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓట్లను పోలరైజ్ చేసేందుకు ......ఒక్క అపాయింట్‌మెంట్‌తో అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి చెక్‌ పెట్టేలా సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story