భాగ్యనగరవాసులూ జర జాగ్రత.. కరోనా తగ్గలే.. కేసులు పెరుగుతున్నయ్

అన్నీ ఓపెన్.. అడ్డే లేదు..లాక్డౌన్ లేదు.. కర్ఫ్యూ లేదు.. భయం అసలే లేదు.. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కరోనా అటాక్ చేయడానికి ఇంకెందుకు ఆలోచిస్తుంది. అందుకే కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఇది అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశం. నగర వాసులు మాత్రం నామ్‌కే వాస్తేగా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు.
నాలుగు రోజుల కిందట నమోదైన కేసులు కరోనా ఇంకా తగ్గలేదనడానికి రుజువులు. తాజాగా హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌కు చెందిన ఓ కుంటుంబం ఇటీవల సన్నిహితుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. ఒకరి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే చేరిన రెండు రోజులకే మరణించారు.
కూకట్ పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఒకే రోజు 11 మంది కరోనా బారిన పడ్డారు. మెహదీపట్నంలోని ఓ కాలనీలో వారం రోజు క్రితం 12 మందికి కరోనా సోకింది. సికింద్రాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో 10 రోజుల వ్యవధిలో 10 కేసులు వెలుగు చూశాయి.
కరోనా తగ్గిపోయిందనుకుని వేడుకలు, శుభకార్యాలు, విందులు, వినోదాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనలు.. గుంపులు, గుంపులుగా జన సంచారం. మాల్స్, షాంపిగ్ కాంప్లెక్స్‌లు అన్నీ రష్. నగరంలోని అనేక కాలనీల్లో 15 రోజుల క్రితం వరకు ఒకటీ రెండు కేసులు తప్ప పెద్దగా కేసులు ఉండేవి కావు. 10 రోజులుగా వాటి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఇది ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్రం మొత్తం అప్రమత్తం కావల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కోవిడ్ నిబంధనలు కొంచెమైనా పాటించకపోతే కేసుల సంఖ్య ఇలానే పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మూడవ ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో కరోనా సృష్టించిన అలజడి కళ్లముందే కదలాడుతున్నా నగర పౌరుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. హైదరాబాద్‌లో 40 శాతం మంది మాస్కులు ధరించడం లేదని పోలీసులు గుర్తించారు. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొద్ది రోజుల క్రిందటి వరకు రోజుకు 10 కేసులు నమోదైతే.. వారం రోజులుగా రోజుకి 30-40 కేసులు వస్తున్నాయి.
మంగళ వారం 40 మంది, బుధవారం 32 మంది బాధితులు ఆస్పత్రులలో చేరారు. 75 శాతం రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వస్తోంది. ప్రభుత్వ పరంగా హెచ్చరికలు చేస్తున్నా అనేకమంది పట్టించుకోవడం లేదు అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com