TS: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కార్పొరేట్ ప్రీ స్కూల్స్

తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. చిన్నారుల విద్య నుంచి పోషకాహారం వరకు సమగ్ర మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో కొత్త కార్యక్రమాలను అమలు చేయడానికి సిద్ధమైంది. ముఖ్యంగా ప్రీప్రైమరీ స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ తరహాలో ప్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 ప్రీస్కూల్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ స్కూళ్ల నిర్మాణానికి ఒక్కో కేంద్రానికి సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా..
తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ–2026”ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం ద్వారా నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచితంగా, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడం, అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టడం వంటి చర్యలను ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోంది. విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, స్కూల్ కిట్స్ వంటి సదుపాయాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రీప్రైమరీ విద్యను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో కార్పొరేట్ తరహాలో ప్రీస్కూల్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 33 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చిన్నారులు ప్రారంభ దశలోనే నాణ్యమైన విద్యను పొందేలా ఈ స్కూళ్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి స్కూల్ నిర్మాణానికి సుమారు రూ.30 లక్షలు వెచ్చించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 11,616 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి కేంద్రానికి సుమారు రూ.2 లక్షల చొప్పున ఖర్చు చేసి అవసరమైన సదుపాయాలను కల్పించనుంది. ఈ చర్యల ద్వారా చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. ఆరోగ్య లక్ష్మి పథకం పరిధిలో తెలంగాణ పోషణ పథం పేరిట కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులు, బాలికలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న కౌమార బాలికల్లో పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.
100 రోజుల పోషకాహార కార్యక్రమం
ఈ ప్రణాళికలో భాగంగా ఏడాదిలో 100 రోజులపాటు ప్రత్యేక పోషకాహార కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రత్యేక న్యూట్రీషియన్ ప్యాకేజీ కింద మల్టీమిల్లెట్ చిక్కీ, ఇన్స్టంట్ మిక్స్, ఉప్మా, కిచిడీ వంటి పోషకాహార పదార్థాలను అందించనున్నారు. అలాగే ప్రీస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్ట్, బూట్లు, సాక్సులు వంటి అవసరమైన వస్తువులను కూడా ప్రభుత్వం అందించనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఏడాదిలో 300 రోజులపాటు ప్రతిరోజూ 100 మిల్లీలీటర్ల పాలు, 25 గ్రాముల అల్పాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారుల పోషణను మెరుగుపరచేందుకు బాలామృతం మరియు బాలామృతం ప్లస్ ఫార్ములేషన్లలో కూడా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మరిన్ని మైక్రో న్యూట్రియెంట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఎదుగుదలలో లోపాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.4 కోట్ల వ్యయంతో 274 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ కేంద్రాల ద్వారా పట్టణ పేదలకు కూడా అంగన్వాడీ సేవలు అందించాలనే ఉద్దేశం ఉంది. రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న 70 శిశు సంక్షేమ ప్రాజెక్టులకు ప్రత్యేక కార్యాలయ భవనాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల శిశు సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
