SAD: విడుదలకు ఆదేశం.. అయిదేళ్ల ముందే ఖైదీ మరణం

తల్లి హత్య కేసులో 11 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న దోషిని.. నిర్దోషిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు వెంటనే అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు జైలు అధికారులకు అందాయి. కానీ తాము విడుదల చేయాల్సిన ఖైదీ... ఆరేళ్ల క్రితమే మరణించాడని తెలుసుకున్న జైలు అధికారులు ఖంగుతిన్నారు. ఈ ఘటన ఇప్పుడు న్యాయ ప్రక్రియ ఆలస్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. కోర్టుల్లో తరగని పెండింగ్ కేసులతో సకాలంలో న్యాయం అందడం లేదు. క్రిమినల్ కేసుల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బెయిలు పిటిషన్లతో సహా క్రిమినల్ అప్పీళ్లపై విచారణలో జాప్యంతో న్యాయం దక్కేలోపు పలువురు ఖైదీలు జైల్లోనే చనిపోతున్నారు. ఇందుకు ఈ ఘటనే ఉదాహరణ.
అసలు ఏమైందంటే...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పెద్దగుండెల అలియాస్ గుండెల పోచయ్య తన తల్లి ఎల్లవ్వను హత్య చేశాడనే నేరంపై 2013లో అరెస్టయ్యారు. వృద్ధురాలైన తల్లిని పోషించలేక ఆమెను చెట్టుకు టవల్‌తో ఉరి వేసి చంపాడనే ఆరోపణలపై దుబ్బాక పోలీసులు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. అనంతరం సిద్దిపేట కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి 2015 జనవరి 12న పోచయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా.. చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. అదే ఏడాది పోచయ్య తరఫున చిన్న కుమారుడు దేవయ్య అలియాస్ దావిద్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఈ సమయంలో బెయిలు పిటిషన్ కూడా దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జులైలో ఈ అప్పీలుపై విచారించిన హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా తేల్చి తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఆయన ఆరేళ్ల క్రితమే చనిపోయినట్లు తేలడం అందరినీ విస్తుపోయేలా చేసింది. చర్లపల్లి ఓపెన్ జైలులో పోచయ్య 2018 ఆగస్టు 15న అనారోగ్యానికి గురికాగా పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. 16న కుటుంబసభ్యులు జైలుకు చేరుకోగా.. అప్పటికే మృతిచెందాడని జైలు సిబ్బంది తెలిపారు. చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోచయ్య చిన్న కుమారుడు దావిద్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
కేవలం వైద్యుడు, దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించడం సరికాదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. మృతిచెందిన ఖైదీల కేసుల వివరాలు జైలు అధికారుల వద్ద కూడా ఉంటాయని, మృతి సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అందజేస్తే ఇలాంటి సంఘటనలకు ఆస్కారం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com