New Year Celebrations: హైదరాబాద్ లో న్యూఇయర్ పార్టీలకు ఈ రూల్స్ మస్ట్..

New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారా? అయితే నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే నంటున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. పబ్బులు, హోటళ్లు, క్లబ్‌లకు మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులకు తెల్లవారుజామున ఒంటిగంట వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
పబ్బుల్లో భౌతిక దూరం తప్పనిసరని, మాస్క్ లేని వ్యక్తులకు అనుమతించవద్దని తెలిపారు. వేడుకల్లో మాస్క్ లేకపోతే వెయ్యి జరిమానా విధిస్తున్నామని తెలిపారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని.. వేడుకలకు రెండ్రోజుల ముందు అనుమతి తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు.
సిబ్బందికి 48గంటల ముందు కొవిడ్ పరీక్షలు చేయాలని, బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదని తెలిపారు. ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలల జైలు, 10వేల రూపాయలు జరిమానా విధిస్తామన్నారు.
అసభ్యకర దుస్తులు ధరించినా.. నృత్యాలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకల్లో మాదక ద్రవ్యాలకు అనుమతిస్తే చర్యలు తీసుకుంటామని, విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మహిళలపై వేధింపులను అరికట్టడానికి షీ బృందాలు, పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు సీపీ ఆనంద్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com