ALLUARJUN: సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదన్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధకరమని వెల్లడించారు. ఆ ఘటన దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపును తీవ్రంగా ఖండించారు. ఇకపై ప్రజలకు, సినిమా అభిమానులకు సందేశం, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు మాత్రమే రాయితీలు, టిక్కెట్ల పెంపుదల కల్పించాలని డిమాండ్ చేశారు. పుష్ప-2 సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌ను హీరోగా చూపించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమా కోసం ప్రజలపై భారం వేసి టికెట్ల రేట్లు పెంచినందుకు తెలంగాణ ప్రభుత్వమే మొదటి ముద్దాయి అని ఆయన ఫైర్ అయ్యారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో వేల రూపాయలు ఖర్చు చేసినా కుటుంబంతో కలిసి సినిమా చూడలేని పరిస్థితులు ఉన్నాయని నారాయణ అన్నారు.
అల్లు అర్జున్ రియల్ హీరో కాదు: చామల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెడితే చేసిన తప్పును ఒప్పుకుంటారని, భవిష్యత్తులో బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పి రియల్ హీరో అవుతారనుకున్నాం, కానీ మీరు స్క్రిప్ట్ రాసుకొచ్చి, రీల్ హీరోగా వ్యవహరించారు. మీకు సినిమా వసూళ్లపై ఉన్న శ్రద్ధ, మనిషి ప్రాణంపై ఉన్నట్లు కనిపించలేదు’ అన్నారు.
అల్లు అర్జున్‌పై బల్మూరి వెంకట్ ఫైర్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఖండించారు. ‘అల్లు అర్జున్ తన మాటలను వెనక్కి తీసుకోవాలి. ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రెస్‌మీట్‌లో పశ్చాత్తాపం ప్రకటిస్తారని అనుకున్నాం. తెలుగు వాడి సత్తా చాటడమంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా’ అంటూ బల్మూరి వెంకట్ విమర్శలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com