Crime: కన్న తండ్రి కాదు కసాయి..

Crime: కన్న తండ్రి కాదు కసాయి..
మైనర్‌ బాలికలను అమ్ముకున్న తండ్రి; కామారెడ్డిలో దాష్టీకం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో కన్న తండ్రి చేసిన నిర్వాకం ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. తల్లిలేని ఇద్దరు మైనర్‌ బాలికలను వదిలించుకోవడం కోసం రెండవ భార్యతో కలసి దారుణానికి ఒడిగట్టాడు.


కామారెడ్డిలోని మాచారెడ్డి మండలానికి చెందిన వ్యక్తి మొదటి భార్య అనారోగ్యంతో మరణించడంతో ఇంకో మహిళను వివాహమాడాడు. మొదటి భార్యతో కవలలు ఉండగా, రెండో భార్యకు కుమారుడు, కూతురు పుట్టారు. ఈనేపథ్యంలో మెదటి భార్య కుమార్తెలను సవతి తల్లికి పెంచడం ఇష్టం లేకుండాపోయింది. ఇది తెలిసిన ఓ మధ్య వర్తి వారికి డబ్బు ఆశ చూపి మైనర్‌ బాలికను పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి ఉన్నాడని తెలిపాడు.


కామారెడ్డిలో ఉంటున్న శర్మన్‌ అనే రాజస్థాన్‌ వ్యాపారికి రూ. 80 వేలకు బేరం కుదిర్చాడు. 14ఏళ్లు ఉన్న రెండో బాలికను అతనికిచ్చి గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో వివాహం జరిపించారు. శర్మన్‌ ఇచ్చిన రూ.80వేలలో రూ.30వేలు మధ్యవర్తి తీసుకొని మిగతా రూ.50వేలు సవతి తల్లి, తండ్రికి ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత మరో బాలికను ఇదే రీతిలో హైదరాబాద్​ కు చెందిన కృష్ణ కుమార్​ అనే వ్యక్తికి రూ.50వేలకు బేరం కుదుర్చుకొని వివాహం జరిపించారు.


మొదటి బాలికను వివాహం చేసుకున్న శర్మన్‌కు ఇంతకు ముందే వివాహం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లు కూడా ఉన్నారు. ఇది కాక వేరొకరితో అక్రమ సంబంధం కూడా ఉన్నది. వివాహానంతరం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో కాపురం పెట్టాడు. దీన్ని గమనించిన బాలిక చాకచక్యంగా అక్కడ నుంచి తప్పించుకొని కామారెడ్డికి చేరుకుంది. బాలల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు బాలికలను రక్షించారు. అనంతరం వారిని బాలల సదనానికి తరలించారు. సదరు బాలికలను అమ్మిన తండ్రి, సవతి తల్లి, మధ్య వర్తితో పాటు వివాహం చేసుకున్న వారిని కూడా అరెస్టు చేసి కటకటాల్లోకి పంపినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story