Crime: సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై రౌడీషీట్‌

Crime: సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై రౌడీషీట్‌
హైదరాబాద్‌లో ఆయనపై 30కి పైగా కేసులు, ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌ బంధువులను మోసం చేసిన కేసులో అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు

సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై గచ్చిబౌలీ పోలీసులు రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆయనపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. చీటింగ్‌, దౌర్జన్యం సహా పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. మోసాలకు కేరాఫ్‌గా మారిపోయాడు శ్రీధర్‌ రావు. అతని అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఫోర్జరీ సంతకాలతో భూములు కాజేస్తూ, మాయ మాటలతో బాధితులను నమ్మిస్తూ కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు. అంతే కాకుండా దాడులకు దిగుతున్నాడు. ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌ బంధువులను మోసం చేసిన కేసులో ఆయన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రౌడీయిజం చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాడు. గచ్చిబౌలిలోని ఒక ఈవెంట్ మేనేజర్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన కేసులో ఆయన్ను అదుపులో తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై ఏకంగా కుక్కలని వదిలాడు. దీంతో ఆయన నేరస్వభావం ఎంతటిదో అర్థమవుతుందంటున్నారు పోలీసులు. వరుస వివాదాల్లో సంధ్య శ్రీధర్‌రావు తల దూర్చుతున్నాడు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అతనిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి, అయినా తన తీరు మార్చుకోలేదు. ఇప్పటికే అతనిపై 30కిపైగా కేసులు ఉన్నాయి.

శ్రీధర్‌రావు గతంలో కొద్ది రోజులపాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. పలువుర్ని మోసం చేశాడనే ఫిర్యాదులు రాగా.. వాటిపై కేసులు కూడా నమోదయ్యాయి. శ్రీధర్‌రావు తనపై లైంగిక దాడి చేశాడని ఆయన దగ్గర పనిచేసే మేల్‌ బాడీగార్డ్‌ ఫిర్యాదు చేయడం గతంలో కలకలం రేపింది. తనకు మాయమాటలు చెప్పి శ్రీధర్‌రావు లొంగదీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. లైంగిక దాడి చేసి ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా అనేక కేసుల్లో ఉండటంతో ఆయన రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు గచ్చిబౌలీ పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story