Crime: నవీన్ హత్య కేసు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు

Crime: నవీన్ హత్య కేసు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు వేగవంతం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. విచారణలోభాగంగా రాచకొండ పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. తొలుత నిందితుడిని మూసారాంబాగ్‌లో అతడి సోదరి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతడి అక్క, బావల వాంగ్మూలం నమోదు చేశారు. సంఘటన జరిగిన రోజు పెద్దఅంబర్‌పేట్‌లో మద్యం కొనుగోలు చేసిన, తాగిన ప్రాంతాలకు తీసుకెళ్లి ఆరా తీశారు. అక్కడి నుంచి ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, గొడవకు దారితీసిన అంశాలు, నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.

బ్రాహ్మణపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో నవీన్‌ శరీర భాగాలను పారవేసిన చోట ఆధారాల కోసం వెతికారు. అనంతరం హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌ ఇంటికి వెళ్లారు. దుస్తులు మార్చుకున్న ప్రాంతాల్లో ఆధారాలను సేకరించారు. హసన్‌ వాంగ్మూలం తీసుకున్నారు. హస్తినాపురం ట్రాఫిక్‌ సిగ్నల్‌ సమీపంలో యువతిని నిందితుడు కలిసినట్టు చెబుతున్న ప్రాంతాన్నీ పరిశీలించారు. సుమారు 3-4 గంటల పాటు ఆయా ప్రాంతాలకు నిందితుడిని తిప్పుతూ వివరాలు రాబట్టారు.

క్రైం సినిమాలు, యూట్యూబ్‌ వీడియోల ప్రేరణతో మర్డర్‌కు స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు నిందితుడు సెల్‌ఫోన్‌లో నేరచిత్రాలు చూశాడు. మృతదేహంలోని భాగాలను వేరుచేయటం గురించి యూట్యూబ్‌లో వెతికాడు. వైద్యులు పోస్టుమార్టం చేసే దృశ్యాలను వీక్షించాడు. వాటిని పదే పదే చూస్తూ హత్యకు ప్రేరేపితుడై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి బయటి వ్యక్తులు సహకరించినట్టు నిర్ధారణ అయితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని రాచకొండ పోలీసులు స్పష్టంచేశారు.

హత్య కేసులో యువతి ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఘటనకు ముందు నవీన్‌, హరిహరకృష్ణ, యువతి మధ్య జరిగిన సంభాషణలు, ఛాటింగ్‌లను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. యువతి, నిందితుడు తమ ఫోన్లలో సమాచారం తొలగించారు. నవీన్‌ సెల్‌ఫోన్‌ ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. దాన్ని నిందితుడు దాచిపెట్టాడా? ధ్వంసం చేశాడా? లేదా ఇంకెవరికైనా ఇచ్చాడా అనే వివరాలు రాబడుతున్నారు పోలీసులు.

ఇక హత్యానంతరం నిందితుడు వరంగల్‌లోని తండ్రి వద్దకు వెళ్లాడు. అతడిని అక్కడికీ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుడు తలదాచుకున్న కోదాడ, ఖమ్మం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తిరిగాడు? ఎక్కడ ఆశ్రయం పొందాడనే విషయాలపై ఇవాళ ప్రశ్నించే అవకాశం ముంది.

Tags

Read MoreRead Less
Next Story