CRIME: బాలికను హత్య చేసింది పదో తరగతి విద్యార్థి

ఆడపిల్ల పుట్టగానే ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని ఎంతో సంబరపడ్డారు. కాళ్లు కిందపెడితే కందిపోతాయని, కలకాలం సంతోషంగా బ్రతకాలని సహస్ర అని నామకరణం చేశారు. అపురూపంగా 10 ఏళ్లుగా మురిపెంగా పెంచుకున్నారు. ప్రతిరోజు ఆ పాపతో ఆడుకుని రోజూవారి కష్టాన్ని మర్చిపోయేవారు. అనుకోకుండా పాఠశాలకు ఆరోజు సెలవు కావటం.. ఈ లోకంలో ఆ చిన్నారికి అదే చివరి రోజు అయ్యింది. యముడి రూపంలో పక్కింటి పిల్లాడు.. బాలిక ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి.. అత్యంత కిరాతకంగా 18 సార్లు కత్తితో పొడిచి కడతేర్చాడు. చిన్న సూది గుచ్చుకుంటేనే ఎంత విలవిలలాడిపోయే మనం పాపం ఆ చిన్నారి భూమి నుంచి వెళ్లిపోయే చివరి క్షణాల్లో ఎంత నరకం అనుభవించిందో తలచుకుంటేనే కలచివేస్తోంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు ఐదేళ్లుగా కూకట్పల్లి సంగీత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ మెకానిక్ షెడ్డులో పనిచేస్తుండగా, రేణుక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. ఈ దంపతులకు సహస్ర(10), కుమారుడు(7) ఉన్నారు. క్రీడోత్సవాల నేపథ్యంలో బాలిక పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఉండగా తమ్ముడు పాఠశాలకు వెళ్లాడు. రోజులాగే దంపతులు వారి విధులకు వెళ్తూ.. తమ్ముడికి లంచ్ తీసుకెళ్లమని చెప్పారు.
అయితే మ. 12 అయినా భోజనం తీసుకురాలేదని స్కూల్ సిబ్బంది ఫోన్ చేయటంతో హుటాహుటీన తండ్రి ఇంటికి వెళ్లగా విగతజీవిగా కుమార్తె మంచంపై కనిపించింది. భయభ్రాంతులకు గురై కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈనెల 18న మధ్యాహ్నం సమయంలో పక్కింట్లో ఉన్న పదొవ తరగతి విద్యార్థి సహస్ర ఇంట్లోకి చొరబడ్డాడు. రూ.80 వేల దొంగిలించి తిరిగి వెళ్తుండగా సహస్ర చూసి దొంగతనం విషయం తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించింది. దీంతో నిందితుడు సహస్ర గొంతు నులిమి తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చనిపోలేదేమో అనే ఉద్దేశంతో విచక్షణరహితంగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేసి పరారయ్యాడు. గత ఐదు రోజులుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ బృందం పక్క ఇంట్లో నుంచి చొరబడే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో పక్క ఇంట్లో సోదాలు చేయగా రక్తంతో ఉన్న బట్టలు, కత్తి, పేపర్‌ను గుర్తించారు. యధావిధిగా శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో తన దైన శైలిలో విచారించి అసలు విషయాన్ని రాబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com