CWC MEET: నేటి నుంచే సీడబ్ల్యూసీ భేటీ

CWC MEET: నేటి నుంచే సీడబ్ల్యూసీ భేటీ
సార్వత్రిక ఎన్నికల వ్యూహ రచనే ప్రధాన ఎజెండా... తరలిరానున్న అగ్ర నేతలు..

త్వరలో జరగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు వ్యూహ రచనే ప్రధాన ఎజెండాగా హైదరాబాద్‌లో నేటి నుంచి రెండురోజులపాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభ అనంతరం విజయభేరి బహిరంగ సభ సైతం ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా CWC భేటీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చిస్తారు. జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతున్నందున దానిపైనా సమాలోచనలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


CWC భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు నేడు హైదరాబాద్‌కు తరలిరానున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సహా హస్తం పార్టీకి చెందిన కీలక నేతలందరూ నేడు హైదరాబాద్‌ తరలిరానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో కొత్త బిల్లు ప్రవేశపెడితే ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపైనా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ అత్యంత ప్రాధాన్యమిస్తుందనే సందేశాన్ని ప్రజలకు చెప్పాలనే లక్ష్యంతోనే CWC సమావేశాలను తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. సాధారణంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇలాంటి కీలక సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాంటిది తెలంగాణలో సమావేశంలో నిర్వహిస్తుండటంతో అధిష్ఠానం రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో అర్థం చేసుకోవచ్చు.


సీడబ్ల్యూసీ సభ్యులుగా తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పులరాజుతోపాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహా, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్‌రెడ్డి, PCC అధ్యక్షుడు, CLP నేతల హోదాల్లో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఈ సమావేశాలకు హాజరవుతారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్ర నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా తుక్కుగూడకు వెళ్లి విజయభేరి సభా వేదికను పరిశీలించారు. తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే CWC సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీల్లో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, శానససభ, మండలి పక్ష కాంగ్రెస్‌ నేతలు పాల్గొంటారు. ఇది ముగిశాక మధ్యాహ్న భోజనం చేసి నేతలంతా తుక్కుగూడలో జరిగే ‘విజయభేరి సభకు హాజరవుతారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో చెప్పే ఆరు ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని విజయభేరి సభలో సోనియా విడుదల చేయనున్నారు.

మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story