Cyber Crime: అమాయకులపై సైబర్ నేరస్థుల పంజా

దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో పెట్టుబడుల పేరుతోనే అత్యధికంగా ప్రజలు సొమ్ము కాజేస్తున్నారు. అంతర్జాలమే ఆయుధంగా అమాయకులకు వల విసురుతూ... చిక్కిన వారిని పీల్చి పిప్పి చేస్తున్నారు.
ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థకు హైదరాబాద్ కార్యాలయంలో CEOగా పనిచేస్తున్న ఓ మహిళకు ఇంటర్నెట్‌లో ఖరీదైన ఫోన్ల క్లియరెన్స్ సేల్స్ అని పాప్ అప్ వచ్చింది. అతి తక్కువ ధరకే ఫోన్లు అమ్ముతున్నామని.... టోకుగా కొంటే ఇంకాస్త చౌక అని అందులో ఉంది. దీనిని క్లిక్ చేస్తే ఫోన్ల ఫోటోలు, వీడియోలు, గతంలో కొన్న వినియోగదారుల కామెంట్లు సైతం కనిపించాయి. నిజమేనని నమ్మిన సదరు మహిళ తన సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో 20 లక్షలు చెల్లించింది. ఎంతకీ సరుకు డెలివరీ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.
ఇటీవల స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరస్థులు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫారెక్స్ లావాదేవీలు, క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. గచ్చిబౌలికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుకు ఇటీవల వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్ధతిలో ఫోన్‌కాల్ వచ్చింది. ఫారెక్స్ లావాదేవీలు నిర్వహించే సంస్థ నుంచి మాట్లాడుతున్నామని.... తమ సంస్థలో పెట్టుబడి పెడితే లక్షల్లో కమీషన్ ఇస్తామంటూ...73 లక్షలు తస్కరించారు. స్టాక్ బ్రోకర్ల పేరుతో జనాలు జేబులకు కత్తెరేస్తున్నారు. ఏ సంస్థ షేర్లు కొంటే లాభాలు వస్తాయో చెబుతామంటూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తారు. పెద్ద ఎత్తున లాభాలు వచ్చినట్లు నకిలీ లింకులు పంపించి.... హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి 36 లక్షలు కొల్లగొట్టారు.
ఇంకొందరు సైబర్‌నేరస్థులు... క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా నమ్మిస్తారు. వీరి మాయలో పడి కాప్రా ప్రాంతానికి చెందిన ఓ I.T ఉద్యోగి 76లక్షలు పోగోట్టుకున్నాడు. మరికొందరు స్టాక్ బ్రోకింగ్ సంస్థ పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. పలానా సంస్థలో సభ్యత్వం తీసుకుని పదిమందిని చేర్పిస్తే దండిగా కమీషన్ ముట్టజెపుతామని నమ్మిస్తారు. మొదట్లో చేరిన వారికి లాభాలిస్తూ ఇతరుల్ని ఆకర్షిస్తారు. ఆ తర్వాత పత్తాలేకుండా పోతున్నారు..
ప్రముఖ వాణిజ్య సంస్థల ఫ్రాంఛైజీలు ఇప్పిస్తామంటూ సైబరాసురులు జనాల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ప్రముఖ సంస్థ ప్రతినిధులమంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేసుకుంటారు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించగానే సంబంధిత పత్రాలు పంపించి.. డబ్బు చెల్లించగానే ఉడాయిస్తున్నారు. KFC ఫ్రాంచైజీ ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి నుంచి 26 లక్షలు, గ్యాస్ డీలర్‌షిప్ పేరుతో మరో మహిళ నుంచి 45లక్షలు దోచుకున్నారు. ఇక పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో జరుగుతున్న మోసాలు సైబర్ నేరగాళ్ల పంట పండిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఆన్‌లైన్‌లో వివిధ సంస్థలకు లైక్‌లు కొట్టి, రివ్యూలు రాస్తే కమీషన్ ఇస్తామంటూ టోకరా వేస్తున్నారు. ముందు కొంత డబ్బు ఇస్తూ... కొత్త అసైన్‌మెంట్ల కోసం డిపాజిట్లు కట్టాలంటారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలా దాదాపు 85లక్షలు పోగోట్టుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com