cyberabad police: 'ఆడు మగాడ్రా బుజ్జీ'.. సైబరా బాద్ పోలీసులు మామూలుగా లేరుగా..

cyberabad police: ఏంటి సినిమా డైలాగులు చెప్తున్నారని అంటారేమో.. మరి ఇప్పుడు ట్రెండ్ అదే.. ఏదైనా ఓ సినిమాలో డైలాగ్ పాపులర్ అయితే అదే అన్నింటికీ వాడేస్తుంటారు.. సైబర్‌బాద్ పోలీసులు కూడా తక్కువేం కాదు.. ఇలా మీమ్స్ తయారు చేయడంలో బాగా పేరు కూడా తెచ్చుకున్నారు.
మొన్నటికి మొన్న ఓ యాడ్‌కి సంబంధించిన మీమ్ తీసుకున్నారు. అయ్యయ్యో వద్దమ్మా అంటూ వచ్చే యాడ్‌ని వాడేసుకున్నారు.. ఇప్పుడు ఆడు మగాడ్రా బుజ్జి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ మీమ్ తయారు చేసారు పోలీసులు.. ట్రెండ్‌కి తగ్గట్టుగా అవగాహన కల్పించడంలో మన తెలంగాణ పోలీసులది అందె వేసిన చేయి.
ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి అమ్మాయిల పేరుతో చాటింగ్ చేసే ప్రబుద్ధులు ఉన్నారు. ఆ విషయం తెలియక మోసపోతున్నారు యువతీ యువకులు ప్రస్తుత రోజుల్లో. చాటింగ్ పేరుతో వలపు వల విసిరి అందిన కాడికి దోచుకుంటున్నారు.
ఆఖరికి విషయం తెలుసుకుని లబోదిబో మంటూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు. సీరియస్‌గా ఇలాంటి వాటి బుట్టలో పడకండి అని చెబితే ఎవరూ వినట్లేదు.. అయినా చెప్పీ చెప్పీ కొంత అవగాహన కల్పించారు నేటి యువతకు సైబర్ పోలీసులు. మళ్లీ ఈ మధ్య ఈ తరహా నేరాలు ఎక్కువవుతుండడంతో ఓ ఫన్నీ మీమ్‌తో ప్రజల ముందుకు వచ్చారు.
మహేష్ బాబు 'అతడు' సినిమాలోని ఓ ఫేమస్ డైలాగ్‌ని వాడేశారు. ' ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందని కొడుకు తండ్రికి చెబుతాడు.. నేను ఆమెతో ఛాటింగ్ కూడా చేస్తున్నాను డాడీ.. చాలా మంచి అమ్మాయిలా ఉందని' మురిసిపోతాడు.. దానికి తండ్రి 'ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా' అని మీమ్ చేశారు.
దీని ద్వారా ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సందేశం ఇచ్చారు. పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ట్యాగ్ చేశారు. బ్రహ్మాజీ కూడా రీ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com