మళ్లీ సొంత గూటికి డీఎస్.. !

నిజామాబాద్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీ సమావేశమైన ఆయన.... హస్తం పార్టీలో చేరడం ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు డీఎస్. ఈ మేరకు రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలకు పిలుపు అందింది. ఢిల్లీలో.... సోనియాగాంధీ సమక్షంలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు డీఎస్.
1989 నుంచి 2015 జూలై వరకు కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం కొనసాగారు డీ శ్రీనివాస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు అనుభవించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే... కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని భావించి.... పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే... ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిజమాబాద్ టీఆర్‌ఎస్ నేతలు... సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో గులాబీ పార్టీతో దూరం పెరిగింది. కేసీఆర్‌ను కలిసే ప్రయత్నం చేసినా ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
మరోవైపు డీఎస్ పెద్ద కుమారుడు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టాక.. డీఎస్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి వచ్చారు. ఈనేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపై ఊహగానాలు వినిపించాయి. తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే సోనియాగాంధీతో చర్చలు జరిపారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ... కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే.... అతని రెండో తనయుడు ధర్మపురి అర్వింద్ నిజామబాద్ బీజేపీ ఎంపీగా ఉండటం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com