తెలంగాణ

KCR : దళితబంధు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు వేగంగా చేరవేయాలి: కేసీఆర్‌

KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని... అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

KCR :  దళితబంధు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు వేగంగా చేరవేయాలి: కేసీఆర్‌
X

KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని... అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా.. సీఎం కేసీఆర్‌కు నివేదించారు. దళితబంధు పథకాన్ని మరింత వేగవంతంగా అమలు చేసేందుకుగానూ త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ పథకం అమలవుతున్న విధానంపై దేశం నలుమూలలనుంచి ప్రశంసలు అందుకుంటున్నామ‌ని చెప్పారు.

ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాల‌ని సీఎం సూచించారు. తద్వారా దళిత యువతలో వున్న నిరాశ‌, నిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంద‌న్నారు. వారు వివిధ వృత్తులు, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంద‌ని తెలిపారు. దవాఖాన‌లు ఫెర్టిలైజర్ షాపుల లాంటి ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం పున‌రుద్ఘాటించారు.

ఇక వ్యవసాయ రంగంపైనా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. వానాకాలం పంటలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పత్తి, మిర్చి, కంది, వాటర్ మిలన్, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఎరువుల నిల్వలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. చాలినంత ఎరువులు ఉన్నాయని సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, పత్తి సాగును ప్రోత్సహించాలి, సన్‌ఫ్లవర్ దిగుబడి పెంచాలని కేసీఆర్

అలాగే యాసంగి వరి ధాన్యం సేకరణపైనా ఆరా తీశారు. కొనుగోళ్లు ఎలా కొనసాగుతున్నాయనే విషయాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ నుంచి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పుంజుకున్నదనీ, గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితర అవసరాలను సమకూర్చుకున్నామని సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 వేల 983 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటికే 536 కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 కేంద్రాల నుంచి సేకరణ మొదలయ్యిందని ఇప్పటికే 1200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని కమిషనర్ సీఎంకు వివరించారు.

వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం... వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతాంగాన్ని ప్రోత్సహించకుండా కేంద్రం నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం దారుణమన్నారు. పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అమలు చేయడం బాధాకరమన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

Next Story

RELATED STORIES