అమ్మ కష్టం ఫలించింది.. సివిల్స్ లో అతడికి..

పేదింటి బిడ్డ అయినా చదువుల తల్లి అండగా ఉంది.. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకున్నాడు. ఆకతాయిగా తిరక్కుండా కష్టపడి సివిల్స్ లో 410 ర్యాంకు సాధించాడు. మారుమూల పల్లె చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేకపోయినా, లక్ష్యం తన కళ్ల ముందు కదలాడుతోంది. అవేవీ తనకు అడ్డురాలేదు. పట్టుదలతో చదివాడు రెండేళ్ల తన శ్రమకు ఫలితం దక్కింది.
కుమురం భీం జిల్లాకు చెందిన పేదింటి బిడ్డ డోంగ్రి రేవయ్య సివిల్స్ లో 410 ర్యాంకు సాధించి కన్న తల్లికి, ఉన్న ఊరికి పేరు తెచ్చాడు. రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రీ మనోహర్- విస్తారు బాయి దంపతులకు శ్రావణ్ కుమార్, రేవయ్య, స్వప్న అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే మనోహర్ మరణించాడు. తల్లి విస్తారుబాయి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. వారిని ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహించింది.
రేవయ్య పదో తరగతి వరకు ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో చదివాడు. ఇంటర్ చిలుకూరు సాంఘీక సంక్షేమ వసతి గృహంలో చదివాడు. 2012లో ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసి 737 ర్యాంకు సాధించాడు. మద్రాసు ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఓఎన్జీసీలో అయిదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పని చేశాడు. సివిల్స్ సాధించాలన్న కల తనని ఆ ఉద్యోగం చేయనివ్వలేదు. దాంతో చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేశాడు. మొదటి అటెంప్ట్ లో రెండు మార్కులత తేడాతో అవకాశం మిస్సయ్యాడు.
తరువాత హైదరాబాద్ లోని బాల లలిత శిక్షణ సంస్ధలో చేరి విజయం సాధించాడు. రేవయ్య మాట్లాడుతూ.. అమ్మ మాకోసం ఎంతో కష్టపడింది. ఐఐటీలో సీటు వచ్చినప్పుడు చేతిలో డబ్బులు లేవు. విషయం తెలిసి దాతలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారు చేసిన మేలు ఎన్నటికీ మరిచిపోలేను. ఉద్యోగంలో స్థిరపడ్డాక నాలాంటి పేద విద్యార్దులకు ఆర్థిక సాయం అందించి వారి లక్ష్యానికి చేయూత అందిచాలనుకుంటున్నట్లు చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com