DALITHA BHANDU : దళితబంధు పథకంపై ఈరోజు శాసనసభలో చర్చ

DALITHA BHANDU : దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై ఇవాళ శాసనసభలో చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే...దళితబంధు పై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం ఈ పథకంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇవ్వనున్నారు.
దళిత సాధికారత పథకం తెలంగాణ దళిత బంధు పథకాన్ని... మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సర్కార్ ఎంపిక చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 14,400 మంది దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లోకి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు జమ చేసింది.
మరోవైపు పైలట్ నియోజకవర్గంగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌తోపాటు, సీఎం కేసీఆర్ దత్తతగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోనూ 76 దళితుల ఖాతాల్లో దళితబంధు నిధులు జమయ్యాయి.
దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు విధివిధానాలు జారీ చేసింది. ఈమేరకు మార్గదర్శకాలు ప్రకటిస్తూ ఎస్సీ అభివృద్ధిశాఖ ఆదేశాలిచ్చింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక.. దళితబంధు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, సంబంధిత పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని వెల్లడించింది. ఖాతాలోకి 9లక్షల 90 వేలు కలెక్టర్ బదిలీ చేయాలని సూచించింది.
లబ్ధిదారులు ఆసక్తి కనబర్చే యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరించాలని మార్గదర్శకాల్లో పేరొన్నారు. వ్యవసాయం- అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ- పరిశ్రమల రంగం, రిటైల్ దుకాణాలు, సేవలు- సరఫరా రంగాలుగా విభజించాలని కోరింది.
10 లక్షలు రూపాయలు యూనిట్ వ్యయం అయ్యే ప్రాజెక్టులను... రిసోర్స్ బృందాలు రూపొందించాలని తెలుపగా... మొత్తం 10లక్షలు విలువచేసేలా రెండు సబ్ యూనిట్లు కూడా ఉండొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి పెద్ద మొత్తంతో యూనిట్‌కు అవకాశం ఇవ్వాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com