మూడు రోజులుగా చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.. ఓ మృతదేహం మూడు రోజులుగా చెట్టుకు వేలాడుతూనే ఉంది. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అక్టోబరు 3న న్యావనందిలో మమత అనే మహిళ హత్య కేసులో గంగాధర్ అనుమానితుడుగా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబ సభ్యుల దగ్గర గంగాధర్ వాపోయినట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి మొన్న శవమై కనిపించాడు. ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, గంగాధర్ ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసుల వేధింపులే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. న్యాయం జరిగే వరకు డెడ్‌బాడీని తీసుకెళ్లనివ్వబోమంటూ గ్రామస్తులు పట్టుబట్టారు. పోలీసులు భారీగా మోహరించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com