నగరవాసులు జాగ్రత్త.. నల్లా నీళ్లలోకి..

నగరవాసులు జాగ్రత్త.. నల్లా నీళ్లలోకి..
హైదరాబాద్ సరస్సులు మరియు ఇతర నీటి వనరులలో భారీ లోహాలు, మురుగునీరు మరియు ఇతర కాలుష్య కారకాలతో పాటు ప్రాణాంతక బ్యాక్టీరియా పెరుగుతోంది.

తాగే నీరు పరిశుభ్రంగా ఉండకపోతే పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. భాగ్యనగరంగా చెప్పుకునే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సరస్సులు, చెరువులు, రిజర్వాయర్లలో ఓ ప్రత్యేకమైన బ్యాక్టీరియా పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఈ విషయాన్ని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. నగర శివారు ప్రాంతాల్లోని సరస్సులలో భారీ లోహాలు, మురికి నీరు, ఇతర కాలుష్య కారకాలతో పాటు బ్యాక్టీరియా పెరుగుతోందని వీరు కనుగొన్నారు.

ఆందోళన కలిగించే మరో అంశం ఈ బ్యాక్టీరియాలో కార్డపెనెంస్ అని పిలిచే ఎన్‌డీఎం-1 (న్యూ ఢిల్లీ మెటల్లో-బీటా-లాక్టమాస్-1) జన్యువును కలిగి ఉందని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్‌లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ తాతికొండ శశిధర్, పరిశోధనా నిపుణుడు రాజీవ్ రంజన్‌తో కలిసి హైదరాబాద్ పరిసరాల్లోని నీటి వనరుల నుంచి నీటి నమూనాలను సేకరించారు.

ఈ నీటిని పరిశీలించగా ఎన్‌డీఎం-1 జన్యువు కలిగిన బ్యాక్టీరియా ఉనికిని కనుగొన్నట్లు వారు తెలిపారు. మంజీరా ఆనకట్ట, సింగూర్ ఆనకట్ట, మంజీరా నీటి శుద్ధి కర్మాగారం, అంబర్‌పేట్ మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎన్‌టీసీ) ఇంకా 13 సరస్సులు, దుర్గం చెరువు, అమీన్‌పూర్, ఉస్మాన్ సాగర్, అల్వాల్, హుస్సేన్ సాగర్, మోమీన్‌పేట్, సరూర్ నగర్, ఫాక్స్ సాగర్, హిమాయత్ సాగర్, కంది, మీర్ ఆలం, నాగోల్, సఫిల్‌గూడ వద్ద ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ఎన్‌డీఎం-1 జన్యువుతో ఉన్న బ్యాక్టీరియా మానవులలో అంటువ్యాధులకు కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story