రోజురోజుకు తగ్గిపోతున్న నాగార్జున సాగర్ నీటిమట్టం

నాగార్జున సాగర్‌లో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. సాగర్ సామర్థ్యం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వలు 515 అడుగులకు పడిపోయాయి. మరో ఐదు అడుగులు కిందకు పోతే.. డెడ్ స్టోరేజీకి చేరుతుంది. దీంతో సాగర్ ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగర్‌లో నీటి నిల్వలు అడుగంటుతుండడంతో.. ఈ సారి ఇక్కడ సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 5.50 లక్షల ఎకరాల్లో సాగుపై దీని ప్రభావం పడుతోంది. ఈ ఐదడుగులను కూడా ఏపీ, తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయిస్తారు. దాంతో సాగర్ ఆయకట్టులో ఈ సారి సాగు అనుమానమేనని స్పష్టమవుతోంది.
ఎగువన వరద తగ్గుముఖం పట్టడం సాగర్‌లో నీటి నిల్వలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు తగ్గాయి. దాంతో.. వరద జాడే లేకుండా పోయింది. ఉన్నా.. అది జూరాల, శ్రీశైలానికే పరిమితమవుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి రోజుకు 50 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. అయితే.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 862.10 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. దాంతో.. శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశాలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. శ్రీశైలం నిండి.. ఎగువ నుంచి వరద కొనసాగితే తప్ప దిగువకు నీళ్లు వదిలే అవకాశాల్లేవని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. రెండేళ్లుగా ఎగువ నుంచి వరద ఉధృతంగా ఉండడం.. శ్రీశైలం నుంచి సకాలంలో నీటి విడుదల జరగడంతో.. వానాకాలం సీజన్‌తోపాటు.. రెండో పంటకు కూడా నాట్లు వేసే అవకాశం ఉండేది. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. 5.50 లక్షల ఎకరాల ఆయకట్టులో.. 10ువరకు నాట్లు పడ్డా.. అక్కడ కూడా నీరు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com