దీక్షిత్ కిడ్నాప్ కేసు విషాదాంతం.. మొదటిరోజే చంపేసిన కిడ్నాపర్లు

దీక్షిత్ కిడ్నాప్ కేసు విషాదాంతం.. మొదటిరోజే చంపేసిన కిడ్నాపర్లు

మహబూబాబాద్‌లో కిడ్నాప్‌కి గురైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కేసు విషాదాంతమైంది. బాబును క్షేమంగా వదిలిపెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లు.. కిడ్నాప్ చేసిన మొదటిరోజే చంపేశారు. ఆరోజు దీక్షిత్ భయంతో కేకలు పెట్టడం, ఏడుపు ఆపకపోవడంతో తీవ్రంగా కొట్టారు. తర్వాత స్లీపింగ్స్ పిల్స్ ఇచ్చి నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొంతు నులిమి చంపేశారు. తర్వాత తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి డెడ్‌బాడీని తగలబెట్టారు. నిన్న మంద సాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో దీక్షిత్‌రెడ్డి బాబాయి మనోజ్‌రెడ్డి ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే సాగర్‌తోపాటు మనోజ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో ఇద్దరి పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లాడిని డబ్బుల కోసం కిడ్నాప్ చేసి చంపేశారని తెలిసిన ఆ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. అభంశుభం తెలియని పిల్లాడిని హత్య చేసిన విషాదఘటన అందరి హృదయాలను కలిచివేస్తోంది.

బాబును కిడ్నాప్ చేసిననట్టు ఫోన్ రావడంతోనే కుటుంబ సభ్యులు వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్నెట్ కాల్ చేస్తూ పలుమార్లు దీక్షిత్‌రెడ్డి తల్లితో మాట్లాడిన ఈ గ్యాంగ్.. డబ్బు రెడీ చేసాక వీడియో కాల్ చేయాలని చెప్పారు. 45 లక్షలు వీడియోకాల్‌లో చూపించాక ఎక్కడికి రావాలో చెప్పారు. తీరా అక్కడికి డబ్బుతో దీక్షిత్‌రెడ్డి తండ్రి రంజిత్‌రెడ్డి వెళ్లారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఎదురు చూశారు. ఇంతలో ఫోన్ చేసిన కిడ్నాపర్లు పోలీసుల్ని వెనక్కు పంపించాలని వార్నింగ్ ఇచ్చారు. పిల్లాడిని ఏమైనా చేస్తారేమోనని భయపడిన రంజిత్‌రెడ్డి వాళ్లు చెప్పినట్టే పోలీసుల్ని పంపేశారు. తర్వాత కిడ్నాప్ గ్యాంగ్ మరో ప్లేస్‌కు రావాలని సూచించింది. అక్కడకు వెళ్లాక కాల్ చేసి డిస్కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి తర్వాత ఏమైందో తెలియక అంతా టెన్షన్‌లో ఉన్నారనగా.. సాగర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. కిడ్నాప్ చేసిన ఆదివారం రోజే పిల్లాడిని చంపేసినట్టు నిర్థారించుకున్నారు. తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతంలో దీక్షిత్‌రెడ్డి డెడ్‌బాడీ గుర్తించారు.

కిడ్నాప్ వ్యవహారంలో మొదట్నుంచి బాబాయి మనోజ్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు కూడా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు. దాదాపు 100 మంది టీమ్‌ను రంగంలోకి దించారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్ కాల్ చేస్తుండడం వల్ల వాళ్లను ట్రేస్ చేయడానికి మొదట్లో సమయం పట్టింది. దీంతో టెక్నికల్ సాయం కోసం హైదరాబాద్ నుంచి సైబర్ టీమ్‌ను కూడా మహబూబాబాద్ పంపారు. ఐతే.. పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యే సరికే విషాదం చోటు చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story