KTR: బండి సంజయ్, అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు లీగల్ నోటీసులు పంపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తన ప్రతిష్ఠను దిగజార్చేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అత్యంత అనుచితమని ఆయన స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగడం తీవ్రంగా ఖండనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లకు విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేయడం అంగీకరించబోమని ఆయన హెచ్చరించారు.
ఈ నెల 23న నిర్వహించిన ఒక ప్రెస్‌మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. తన కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ దురుద్దేశాన్ని స్పష్టంగా చూపుతోందని అన్నారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా కొనసాగుతున్నప్పటికీ, అదే తరహాలో మళ్లీ తప్పుడు ఆరోపణలు చేయడం ఉద్దేశపూర్వకమని కేటీఆర్ మండిపడ్డారు. కోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసినా కూడా అదే అంశంపై మళ్లీ వ్యాఖ్యలు చేయడం న్యాయ ప్రక్రియను కూడా అవమానపరచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే నేతలు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని కేటీఆర్ సూచించారు. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా, రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల తన రాజకీయ ప్రతిష్ఠకు, కుటుంబ గౌరవానికి తీవ్ర నష్టం వాటిల్లిందని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.అలాగే ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, డ్రగ్స్ సేవించడం, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా తన ప్రతిష్ఠను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
