CBI: కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ

CBI: కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ
ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.... తీహాడ్‌ జైలులో ఉన్న కవితని అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ ప్రకటన

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ అరెస్ట్‌ చేయటంతో తీహాడ్‌ జైలులో ఉన్న కవితని అరెస్ట్‌ చేసినట్లు మరో దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు ప్రకటించింది. నేడు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టులో సీబీఐ రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించనుంది. న్యాయస్థానం అనుమతిస్తే అదుపులోకి తీసుకొని ప్రశ్నించనుంది.

ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ED అరెస్టు చేసిన బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ-CBI అరెస్టు చేసింది. ప్రస్తుతం తీహాడ్ జైలులో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో CBI అరెస్టు చేసింది. గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా కవితకు దర్యాప్తు సంస్థ సమాచారం పంపింది. IPC 477, 120-B సహా అవినీతి నిరోధక చట్టంలోని ఏడో సెక్షన్‌ ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపింది. ఇందుకోసం రౌస్ అవెన్యూకోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో కవితను హాజరుపరచనున్న సీబీఐ... రిమాండ్‌ రిపోర్టు సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది. ప్రత్యేక కోర్టు అనుమతిస్తే కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది. తీహార్‌ జైలులో ఉన్న తనకు బెయిల్‌ వస్తుందని ఆశలు పెట్టుకున్న కవితకు... సీబీఐ అరెస్ట్‌తో ఊహించని పరిణామం ఎదురైంది.

మద్యం విధానం రూపకల్పన కోసం అనేక ముడుపులు చేతులు మారాయని... ఈ పాలసీ రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ తొలుత CBI కేసు నమోదు చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ జరుపుతున్న CBI.... 2022 డిసెంబర్‌ 11న తొలుత హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను మూడ్రోజుల పాటు విచారించింది. దిల్లీ మద్యం విధానం రూపకల్పన కేసులోనే గత నెల 15న కవితను ఈడీ అరెస్టుచేసి, పదిరోజుల పాటు విచారించగా... ఆ తర్వాత, జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ఆమె తిహాడ్‌ జైళ్లో ఉన్నారు. అటు, కేసు దర్యాప్తులో భాగంగా శనివారం కోర్టు అనుమతితోనే కవితను తిహాడ్‌ జైల్లో సీబీఐ విచారించింది. సహ నిందితుడు బుచ్చిబాబు ఫోన్‌ నుంచి రికవరి చేసిన వాట్సాప్‌ చాట్స్‌ ఆధారంగా ప్రశ్నించింది. దిల్లీ మద్యం పాలసీలో లిక్కర్‌ లాబీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీకి 100కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణపైనా విచారించినట్లు తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి ఈడీ... కవితను మార్చి 15న అరెస్ట్‌ చేయటంతో ప్రస్తుతం తీహాడ్‌ జైల్లో జ్యూడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story