Delhi Liquor Scam: కలకలం రేపుతున్న సుఖేష్‌ మరో లేఖ

Delhi Liquor Scam: కలకలం రేపుతున్న సుఖేష్‌ మరో లేఖ
కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్‌ తో పాటు ఎమ్మెల్సీ కవితపై పలు ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశారు

ఆర్థిక నేరస్తుడు సుకేష్‌ చంద్రశేఖర్ మరోలేఖ కలకలం రేపుతుంది. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్‌ తో పాటు ఎమ్మెల్సీ కవితపై పలు ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశారు. సుఖేష్ లాయర్ మాలిక్ పేరుతో ఈ లేఖ విడుదల అయ్యింది. అనేక అంశాలపై సుఖేష్‌ కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో చాట్ జరిపారంటూ సుఖేష్ లాయర్ మాలిక్ లేఖ విడుదల చేశారు. లేఖలో కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, కైలాష్ గెహలట్, ఎమ్మెల్సీ కవిత నగదు లావాదేవీలు అంశం ప్రస్తావించారు. 2020లో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల నగదు పంపిణి చేశానంటూ లేఖలో తెలిపారు. కవిత, సత్యేంద్ర జైన్‌కు మధ్య జరిగిన సంభాషణలు జత చేస్తున్నానంటూ లేఖ విడుదల చేశారు.

కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌కు చెందిన 15 కోట్ల రూపాయలను కవితకు ఇవ్వాలన్నారంటూ లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ లైసెన్సుల కోసం కవితతో లావాదేవీలు జరిపానంటూ వెల్లడించారు. కిక్స్ బ్యాక్‌గా ఉన్న మొత్తాలు హైదరాబాద్‌ నుంచి హవాలా ద్వారా ఆసియా దేశాలకు లాండరింగ్ చేశానని చెప్పారు. కేజ్రీవాల్ ఢిల్లీ నుండి ఎటువంటి లావాదేవీలు నిర్వహించకూడదని ప్రత్యేకంగా పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.

ఇక కోవిడ్ సమయంలో నగదు లావాదేవీలు కేజ్రీవాల్, ఆమ్ అద్మీ పార్టీ కోసం హైదరాబాద్ నుండి నిర్వహించబడ్డాయని లేఖలో వివరణ ఇచ్చారు. చాట్ కాపీలలోని కొన్ని వివరాలను ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌ నుండి తన కుటుంబంపై ఒత్తిడి ఉందన్న సుఖేష్.. ఈ మేరకు దర్యాప్తు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని లేఖలో స్పష్టం చేశారు.

సుకేష్‌కు ఆమ్ అద్మీ పార్టీ, కేజ్రీవాల్‌కు మధ్య చాలా రకాల ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయంటూ లేఖలో తెలిపారు. లిక్కర్ స్కామ్‌పై విచారణ నేపథ్యంలోనే విషయాలు వెల్లడిస్తున్నాని చెప్పిన సుఖేష్... ఈ వివరాలు ఈడీకి ఉపయోగపడే ఛాన్స్ ఉందన్నారు. అవసరమైతే తనకు, AAPకి మధ్య జరిగిన అన్ని లావాదేవీల వాయిస్ నోట్స్‌తో పాటు ఇతర చాట్‌లను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాన్నారు. ఇక ఇటీవల కాలంలో సుఖేష్ విడుదల చేస్తున్న లేఖలో ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే లేఖలో ప్రస్తావించిన విషయాలపై విచారణ తరువాతే నిజానిజాలు తేలే అవకాశం ఉంది.

Tags

Next Story