Telangana Dengue : తెలంగాణకు 'డెంగ్యూ ఫీవర్'.. ఆందోళనకరంగా కేసులు..

Telangana Dengue : తెలంగాణకు డెంగ్యూ ఫీవర్.. ఆందోళనకరంగా కేసులు..
Telangana Dengue : తెలంగాణలో డెంగ్యూ టెన్షన్ పెడుతోంది. చాలా స్పీడ్‌గా వ్యాపిస్తోంది

Telangana Dengue : తెలంగాణలో డెంగ్యూ టెన్షన్ పెడుతోంది. చాలా స్పీడ్‌గా వ్యాపిస్తోంది. సీజనల్ వ్యాధుల సీజన్‌ కావడంతో డెంగ్యూ దోమలు మరింత ఎక్కువగా వ్యాప్తి చెంది... జనాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే దాదాపుగా మూడు రెట్లకు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 64 వేల కిట్స్‌ను టెస్టుల కోసం ఏర్పాటు చేసింది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. ప్రధాన ఆస్పత్రుల్లో అన్నిoట్లో టెస్టింగ్ కిట్లను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 6 వేల 151 డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా సమాచారం. ఇందులో దాదాపుగా 3 వేలకు వరకు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో 588, మేడ్చల్ జిల్లాలో 411, ఖమ్మంలో 361, సంగారెడ్డిలో 208, కరీంనగర్‌లో 191, మహబూబ్‌నగర్ జిల్లాలో 152 డెంగ్యూ కేసులు నమోదు కాగా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 148, పెద్దపల్లిలో 135, వికారాబాద్‌లో 115, అదిలాబాద్‌లో 106 కేసులు నమోదైనట్టుగా లెక్కలు చెబుతున్నాయి. మిగతా జిల్లాలో వందలోపు డెంగ్యూ పాజిటివ్ నమోదైనట్టుగా సమాచారం. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 2 వేల 766 కేసులు నమోదు కాగా ఈసారి ఏకంగా 6 వేల 151 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అంటే గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు డెంగ్యూ కేసులుగా తేలినవన్నీ... దాదాపుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్‌లో ఉన్న రోగుల లెక్కలు మాత్రమే. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగ్యూ కేసుల వివరాలను దాస్తున్నట్టుగా సమాచారం. కనీసం ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఎక్కించడం లేదని తెలుస్తోంది. నిజానికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులపై ప్రభుత్వ అధికారుల మోనిటరింగ్ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా సరైన లెక్కలు ప్రభుత్వానికి అందిస్తే... ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగ్యూకి సపరేట్ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, జగిత్యాల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లో డెంగ్యూకు సపరేట్ వార్డులని ఏర్పాటు చేసింది వైద్యారోగ్య శాఖ. ఎక్కడైనా ఎవరికైనా... ప్లేట్లెట్స్ పడిపోతే వెంటనే ఎక్కించేందుకు కూడా ఏర్పాటు చేసింది.

గతంలో వర్షాకాలం వచ్చిందంటే వందల సంఖ్యలోనే ఓపి ఉండేది. కానీ ఈ వర్షాకాలంలో ఓపీ వేల సంఖ్య దాటుతున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఓపీతో పాటు ఇన్ పేషెంట్ వార్డులన్నీ కూడా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ అని తేడా లేకుండా డెంగ్యూ పాజిటివ్‌లతో విపరీతమైన రోగుల తాకిడి ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో డెంగ్యూ దోమలను అరికట్టకపోతే ఈ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story