Bhatti Vikramarka: సమగ్ర కులగణనను దేశమంతా గమనిస్తోంది : భట్టి విక్రమార్క

రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర సర్వేపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్యూమరేటర్లతో కలెక్టర్లు మాట్లాడి ప్రజల్లో తలెత్తే సందేహాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనేలా రోజూ సమాచారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో సమగ్ర కులగణనను దేశమంతా గమనిస్తోందని ఈ సందర్భంగా భట్టి పేర్కొన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారు, ఎనిమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారు, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది.. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం అవడం ఆధారపడి ఉంటుంది అన్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు.
ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్య యితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com