TS: మేడిగడ్డలో నాణ్యత పరీక్షలకు తిలోదకాలు!

తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్ లోపాలతోపాటు క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు నాణ్యత పరీక్షలకు తిలోదకాలిచ్చారనే వాదన వినిపిస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ ఇటీవల బ్యారేజీని సందర్శించిన విజిలెన్స్ బృందం క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ల నుంచి అవసరమైన సమాచారం, రికార్డులు కోరగా వారు నీళ్లు నమిలినట్లు సమాచారం. బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగిపోవడమే కాకుండా గేట్ల దిగువన నీళ్లు పడేచోటు-గ్లేసియర్స్ దెబ్బతినడం, రెండు పియర్స్ మధ్య ఉన్న గోడ మధ్యలో కాంక్రీటు లేచిపోవడం,పియర్స్ బాగా పాడవ్వడంతో నాణ్యతపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలిసింది. నాణ్యతకు సంబంధించి 18 రకాల వివరాలివ్వాలని వారు క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరును కోరారు. బ్యారేజీ పునాది పని జరిగే సమయంలో పరిశీలించిన అంశాలు., కోర్ తీసి చేసిన పరీక్షల సమాచారం, ఇన్వెస్టిగేషన్, సర్వే వివరాలను తేదీలతో సహా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
బ్యారేజీ నిర్మాణం ఏ తేదీన ప్రారంభమైంది., వచ్చిన మెటీరియల్‌ను పరీక్షించిన వివరాలు, కాంక్రీటు మిక్స్ డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో చేసిన పరీక్షల వివరాలు, ప్రతినెలా బిల్లులు చెల్లించేందుకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు రికార్డుల పరిశీలనకు సంబంధించిన ఆధారాలివ్వాలని అడిగినట్లు సమాచారం. క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు పరిశీలన తర్వాత రాసిన రిమార్కులు, సరిదిద్దిన అంశాలు, ఉన్నతాధికారులు పరిశీలించినప్పటి వివరాలు, నిర్మాణ ప్రాంతంలో ఉన్న ఇంజినీర్లతో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వచ్చిన ఫిర్యాదులపై తీసుకొన్న చర్యలు ఇలా పూర్తిస్థాయిలో వివరాలు కోరినట్లు తెలిసింది. వచ్చినవి వచ్చినట్లుగా ఆమోదించడమే క్వాలిటీ కంట్రోల్ పనా అని విజిలెన్స్ అధికారులు క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లను నిలదీసినట్లు తెలిసింది. వచ్చే ఫైళ్లు, బయటకు వెళ్లే ఫైళ్ల నంబర్లను సీజ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం సహా పని జరిగిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లు నాణ్యతను పరిశీలించి ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
కానీ ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్లు గుత్తేదారులు ఎలాచెబితే అలా చేశారనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ బాగా దెబ్బతిన్నాయి. మొదట 7వ బ్లాక్‌లోని 20వ పియర్ కుంగిపోగా దానికి ఇరువైపులా ఉన్న 19, 21 పియర్స్ దెబ్బతిన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. కానీ ఇతర బ్లాకుల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. దిగువ భాగాన మరిన్ని సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విజిలెన్స్ బృందాలు, డైరెక్టర్ జనరల్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించినపుడు మరిన్ని లోపాలు గుర్తించారు. సుమారు 11 పియర్స్‌పై ప్రభావం పడినట్లు వారు భావిస్తున్నారు. ఇంకా 22వ పియర్ బీటలు వారింది. 11వ పియర్ సైతం నిలువుగా చీలినట్లు బీటలున్నాయి.
26వ పియర్ గేటుకు దిగువ భాగాన, 19వ పియర్‌కు పగుళ్లు తేలాయి. బ్యారేజీ గేట్ల వద్ద గ్లేసియర్స్ దెబ్బతిన్నాయి. ఆరో బ్లాక్‌లోని 25-26 పియర్స్ గోడ మధ్యలో ఉన్న కాంక్రీట్ కొట్టుకుపోయి కుప్పలా పడింది. 29-30వ పియర్స్ మధ్య గేటు దిగువన కొంతభాగం కొట్టుకుపోయింది. పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. రాఫ్ట్ కింది భాగంలో ఇసుక జారిపోయినట్లు తెలుస్తోంది. ప్రవాహ ఉద్ధృతిని తట్టుకునేందుకు రక్షణగా ఏర్పాటు చేసిన సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆపై సరైన చర్యలు చేపట్టకపోవడంతో నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com