Regional Parties: కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మద్దతు తెలిపిన దేవెగౌడ.. కూటమి విషయంలో..

Regional Parties: కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మద్దతు తెలిపిన దేవెగౌడ.. కూటమి విషయంలో..
Regional Parties: జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్‌... ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో పడ్డారు.

Regional Parties: జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్‌... ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో పడ్డారు. ఢిల్లీ వెళ్లి కొట్లాడతా అంటూ ఇటీవలికాలంలో తరచూ ప్రకటిస్తున్న గులాబీ బాస్‌.. బీజేపీపై ఒంటికాలుపై లేస్తున్నారు. అదే క్రమంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను, ముఖ్యంగా రీజనల్‌ పార్టీలను ఒక్కతాటిపైకి తేచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా ఇది మరింత ఊపందుకుంది.

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. కేసీఆర్‌, స్టాలిన్‌కు ఫోన్‌ చేసి ఢిల్లీలో మాట్లాడుకుందాం అని ప్రపోజల్‌ పెట్టగా.. మరుసటి రోజే మాజీ ప్రధాని, జనతాదళ్‌ సెక్యూలర్‌ జాతీయధ్యక్షుడు దేవెగౌడ కేసీఆర్‌కు ఫోన్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్​కు ఫోన్‌ చేసిన దేవెగౌడ.. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. రావు సాబ్.. మీరు అద్భుతంగా పోరాడుతున్నారు.

మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా ఉంటాం. మీ యుద్ధాన్ని కొనసాగించండి. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని కేసీఆర్​కు దేవగౌడ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవెగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు.

బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి గురించి గట్టిగా ప్రతిపాదిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. కేసీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మమత సోమవారం స్వయంగా వెల్లడించారు. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. దేశ సమాఖ్య స్వరూపం విచ్ఛిన్నానికి గురి కాకుండా తామంతా కలిసి ప్రయత్నిస్తున్నామని తెలిపారు

ఇప్పటికే కేరళ సీఎంతో పాటు సీపీఐ, సీపీఎం జాతీయ నేతలను, బీహార్‌ ఆర్జేడీ అగ్రనేతతో మంతనాలు జరిపిన కేసీఆర్‌.... కొన్ని రోజుల కిందట తమిళనాడు వెళ్లి స్టాలిన్‌ను కలిశారు. త్వరలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో పాలు పలువురు విపక్ష నేతలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కేసీఆరే స్వయంగా వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పిన కేసీఆర్​కు సర్వత్రా మద్ధతు లభిస్తుండడం పట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురపడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story