దసరా రోజున ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పండుగ రోజును ప్రజలు మంచి మూహుర్తంగా భావిస్తున్నందున సీఎం కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ను అదే రోజు ప్రారంభించనున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం. అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలన్నారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్ కు వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు.
డెమో ట్రయల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పి,స్తామన్నారు. మండలానికి ఒకరు , ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు తెలిపారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. తహశీల్దారు కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో డాక్యుమెంట్ రైటర్స్ కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా.. ధరణి పోర్టల్ లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు. ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటవెంటనే నమోదు చేయడం జరుగుతుందన్నారాయన. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తునందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయన్నారు. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలు జరగవని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com